బెదిరిస్తున్నాడని ప్రాణం తీశారు..
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:21 AM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్‌పేట శివారులో గత నెల 28న జరిగిన హత్య చేసిన మిస్టరీని పోలీసులు ఛేదించారు.
చౌటుప్పల్ రూరల్, జూన్3(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్‌పేట శివారులో గత నెల 28న జరిగిన హత్య చేసిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సైదా బాద్‌కు చెందిన మారోజు రమేశ్(33) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ చంపాపేటకు చెందిన లెంకల భాస్కర్(30) వద్ద రమేశ్ ఆటో అద్దె తీసుకుని నడుపుతున్నాడు. రమేశ్ భార్యకు భాస్కర్‌తో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భాస్కర్‌తో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టించాడు. గత నెల 28న రమేశ్ భాస్కర్ ఇంటికి వెళ్లి భాస్కర్ కుటుంబ సభ్యులను బెదిరించాడు. తరుచూ రమేశ్ తనను బెదిరించడంతో భాస్కర్ రమేష్‌పై పగ పెంచుకున్నాడు. హైదరాబాద్ మిదానికి చెందిన రియాజ్‌కు ఫోన్ చేసి బెదిరింపు విషయంపై భాస్కర్ సమాచారం ఇచ్చాడు. రియాజ్ రమేశ్‌కు ఫోన్ చేసి సరూర్‌నగర్‌లోని ఓ బార్‌కు తీసుకెళ్లాడు. రమేశ్, భాస్కర్, రియాజ్‌లు కలిసి మద్యం తాగారు. అదే రాత్రి మద్యం కోసమని బైక్‌పై చౌటుప్పల్ మండలం తూఫ్రాన్‌పేటకు వచ్చారు. మధ్యలో మద్యం సేవించారు. తూఫ్రాన్‌పేట శివారు లోని గ్రీన్‌సిటీ వెంచర్‌లోకి వెళ్లి మళ్లీ మద్యం తాగారు. ఇదే అదునుగా భావించి రమేష్ తలపై కర్రతో కొట్టారు. రమేశ్ పారిపోతుండగా పట్టుకుని బియ్యం బస్తాతో ఉరేసి చంపేశారు. అక్కడి నుంచి భాస్కర్, రియాజ్ పారిపోయారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో భాస్కర్, రియాజ్ బైక్‌పై చౌటుప్పల్‌కు వస్తుండగా తూఫ్రాన్‌పేట వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.