Share News

తవ్వారు.. వదిలేశారు

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:42 AM

నల్లగొండ పట్టణంలో చేపట్టిన అండర్‌గ్రౌండ్‌ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి.

 తవ్వారు.. వదిలేశారు
గొల్లగూడలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు

తవ్వారు.. వదిలేశారు

అస్తవ్యస్తంగా అండర్‌గ్రౌండ్‌ నిర్మాణ పనులు

ఇబ్బందులు ఎదుర్కొటున్న ప్రజలు

నల్లగొండ పట్టణంలో చేపట్టిన అండర్‌గ్రౌండ్‌ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం పలు చోట్ల గుంతలు తవ్వి వదిలేశారు. పని పూర్తయిన తర్వాత సదరు కాంట్రాక్టర్‌ గుంతలను పూడ్చి వే యకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- (ఆంధ్రజ్యోతి,నల్లగొండటౌన)

పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో చేపట్టని పనులను రెండో విడతలో భాగంగా చేపడుతున్నారు. అనేక చోట్ల పైప్‌లైన, మ్యానహోల్స్‌ నిర్మాణం కోసం చేపట్టిన పనులు ముందు చూపులేకుండా చేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని 20వ వార్డు గొల్లగూడలో అంధుల పాఠశాలకు వెళ్లే మార్గంలో గతంలో కవర్‌ కాని వీధుల్లో అండర్‌గ్రౌండ్‌ పైపులైన, డ్రైనేజీ పనులను ఇటీవల చేపట్టారు. అయితే పైపులైన, మ్యానహోల్స్‌ కోసం ఎక్స్‌కవేటర్లతో గుంతలు తీసిన కాంట్రాక్టర్‌ పనులు పూర్తయ్యాక మట్టిని సరిగా చదును చేయకపోవడంతో ఆ మార్గం ద్వారా వెళ్లే వాహనాలు కాదు కదా కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నచిన్న వర్షాలకే రోడ్డంతా బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ పనులు పూర్తయినందన వెంటనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఇక నాలుగో వార్డు కేశరాజుపల్లి ఎస్సీ కాలనీలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది. కాలనీలో అసలే ఇరుకుగా ఉండే వీధుల్లో మ్యానహోల్స్‌ నిర్మాణం కోసం పెద్దపెద్ద గుంతలను తీసి వాటిని సరిగా పూడ్చకపోవడంతో ఇళ్ల ఎదుట రోడ్డుపై మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. వెంటనే మట్టిని చదను చేసి రోడ్లు నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఖాళీ ప్రాంతాల్లో పనులు

పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ నిర్మాణంలో భాగంగా 20 సంవత్సరాల క్రితం మెదటి విడత పైపులైన్లు వేశారు. కానీ సీనరేజ్‌ ప్లాంటు ఏర్పాటు చేయకపోవడంతో అనేకచోట్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వందల కోట్లు వెచ్చించినప్పటికీ మ్యానహోల్స్‌ పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే తాజాగా మంజూరైన నిధుల ద్వారా గతంలో కవర్‌కాని ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు.

అయితే ఇందులో ప్రాధాన్యత క్రమంలో ఇళ్లు ఉన్న చోట కాకుండా ఖాళీ ప్లాట్ల వద్ద అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యూజీడీ పనులు చేసిన దగ్గర పెద్ద పెద్ద గుంతలు పడటం వల్ల మ్యానహోల్స్‌ రోడ్డుపైకి ఉండటంతో ప్రమాదాల బారినపడే అవకాశం కూడా లేకపోలేదు. యూజీడీ నిర్మాణం జరిగిన ప్రతీ చోట సీసీ రోడ్లు వేయాలని, సీనరేజి ప్లాంటు పూర్తి చేసి యూజీడీ పైప్‌లైన కనెక్షన ఇచ్చి ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్ల నిర్మాణం తక్షణమే చేపట్టాలి

అండర్‌గ్రౌండ్‌ నిర్మాణం కోసం తీసిన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో తీవ్ర ఇవ్వందులు పడుతున్నాం. వర్షాలు వస్తే ఈ మార్గంలో నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అండర్‌గ్రౌండ్‌ పనులు పూర్తయినందున వెంటనే ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. దోమల బెడద కూడా ఎక్కవగా ఉన్నందున ఫాగింగ్‌ చేయాలి.

- నాంపల్లి యాదయ్య, నల్లగొండ

Updated Date - Jul 20 , 2025 | 12:42 AM