Share News

kumaram bheem asifabad- పాతవి పెంచరు.. కొత్తవి ఇవ్వరు

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:24 PM

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్తగా ఆసరా పింఛన్‌ మంజూరు చేస్తామని, ఉన్న పింఛన్లను మరో రెండు వేల రూపాయలు పెంచుతా మని ఇచ్చిన హామీ ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా నెరవేరకపోవడంతో లబ్ధిదారులు, అర్హులు ఆందోళన చెందుతున్నారు.

kumaram bheem asifabad- పాతవి పెంచరు.. కొత్తవి ఇవ్వరు
లోగో

- దరఖాస్తులు స్వీకరించి నెలలు గడుస్తున్నా కలగని మోక్షం

- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు

బెజ్జూరు, జులై 12 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్తగా ఆసరా పింఛన్‌ మంజూరు చేస్తామని, ఉన్న పింఛన్లను మరో రెండు వేల రూపాయలు పెంచుతా మని ఇచ్చిన హామీ ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా నెరవేరకపోవడంతో లబ్ధిదారులు, అర్హులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన, గ్రామ వార్డుసభల్లోనూ వృద్ధాప్య, వితంతు, చేనేత, దివ్యాంగులు తదితర పింఛన్ల కోసం సుమారు ఐదువేలకుపైగా దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయలేదు. ఎన్నికల సందర్బంగా దివ్యాంగులకు 6,000, ఇతరులకు 4,000 పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి పింఛన్‌ పెంచకపోవడం గమనార్హం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2016 పెన్షన్‌ ఇవ్వగా, తాము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు రెండింతలు చేస్తామని, కుటుంబంలో ఇద్దరికి సమానంగా పెన్షన్లు ఇస్తామని 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా హామీ అమలు కావడం లేదని పెన్షన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న పెన్షన్‌ తమ అవసరాలకు ఉపయోగపడుతున్నప్పటికీ ప్రస్తుతం నిత్యవసరాల ధరలు భారీగా పెరుగడంతో ప్రభుత్వం పెన్షన్‌ డబ్బులు ఏ మాత్రం సరి పోవటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.

- ఆరు గ్యారంటీల్లో భాగంగా..

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలులో భాగంగా నిమగ్నమైన ప్రభుత్వం పెన్షన్‌ పెంపు విషయం మరిచి పోయిందని లబ్ధిదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం తమ పెన్షన్‌ పెంచుతుందని ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నామని పెన్షన్‌దారులు పేర్కొంటున్నారు. వృద్ధుతకిచ్చే పెన్షన్‌ రూ.2016 నుంచి రూ.4016కు, దివ్యాంగుల పెన్షన్‌ రూ.4016 నుంచి రూ.6016కు పెంచుతామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీ ప్రకారం ఆసరా పెన్షన్లను పెంచి ఆదుకోవాలని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. పలుమార్లు పింఛన్లను పెంచుతామని ప్రకటించినా ఇప్పటికి ఆచరణలో అమలు కాలేదు.దీంతో వారి ఆశలు నెరవేరడం లేదు. ఎవరూ లేని అనాథలకు పింఛన్లు ఆసరాగా ఉంటుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం పాత పింఛన్లే కొనసాగుతున్నాయి.

- జిల్లా వ్యాప్తంగా..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం పదిహేను మండలాల పరిధిలో 56,225 మంది ఆసరా పింఛన్‌దారులున్నారు. ఇందులో వృద్ధాప్య పెన్షన్‌దారు లు 24,235, దివ్యాంగులు 5,974, వితంతులు 22,095, చేనేత పెన్షన్లు 489, గీత కార్మికులు 139, బీడీ కార్మికులు 86, ఒంటరి మహిళల 2,605, ఫైలేరియా బాదితులు 567, డయాలసిస్‌ బాధితులు 35 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ. 13కోట్ల ఆసరా పెన్షన్ల ద్వారా అందజేస్తున్నారు. కొత్తగా భర్తలు కోల్పోయిన మహిళలు,దివ్యాంగులు సైతం ప్రభుత్వం నుంచి పింఛన్‌ అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి భర్తకు పింఛన్‌ ఉండి ఆయన మరణిస్తే ఆ వెంటనే ఆయన భార్యకు, భార్యకు పింఛన్‌ ఉండి ఆమె మరణిస్తే భర్తకు మంజూరు చేస్తున్నారు. కానీ కొత్తగా ఎవరు దరఖాస్తు చేసుకున్నా కూడా పింఛన్లు మంజూరు చేయడం లేదు. దీంతో పలు కుటుంబాలు పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇలా జిల్లాలో వివిధ రకాల పింఛన్ల కోసం సుమారు ఐదువేల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో బాగంగా చేయూత కింద ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను రెట్టింపు చేస్తామని, అర్హులైన వారికి కొత్తగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయకపోగా, ఉన్న వా టిని పెంచకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.

ప్రభుత్వం హామీని అమలు చేయాలి..

- నికాడి రోశయ్య, ఎల్కపల్లి

ఆసరా పింఛన్‌దారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ని అమలు చేయాలి. గత ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరా పెన్షన్‌ కింద రూ.4016 ఇచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ రూ.2016 నుంచి రూ.4016, దివ్యాంగుల పెన్షన్‌ రూ.4016 నుం చి రూ6016 ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచి లబ్ధిదారులను ఆదుకోవాలి.

Updated Date - Jul 12 , 2025 | 10:24 PM