Share News

ఆధార్‌ సేవాకేంద్రంలో చోరీ

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:32 AM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆధార్‌ సేవాకేంద్రంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.

ఆధార్‌ సేవాకేంద్రంలో చోరీ
ఆధార్‌ సేవాకేంద్రంలో చిందరవందరగా పడిఉన్న సామాగ్రి

రూ.4లక్షల విలువైన సామాగ్రి అపహరణ

మిర్యాలగూడ అర్బన్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆధార్‌ సేవాకేంద్రంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. కేంద్రం నిర్వాహకులు, వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం సెలవు కావడంతో ఆధార్‌ సేవా కేంద్రాన్ని శనివారం సాయంత్రం మూసి వేసి తన స్వగ్రామం వెంకటాద్రిపాలేనికి వెళ్లాడు. గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు కేంద్ర తాళాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సోమవారం ఉదయం కేంద్రం నిర్వాహకుడు తన ఆధార్‌ సేవా కేంద్రం వద్దకు వచ్చి చూడగా తలుపులు ధ్వంసమై ఉండడం, గదిలోని వస్తువులు చింతరవందరగా పడి ఉండడంతో వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కాగా కేంద్రంలోని 2ల్యాప్‌ట్యా్‌పలు, 2డెస్క్‌టా్‌పలు, 2 ప్రింటర్లు, మొబైల్‌, ఐరిష్‌. ఫింగర్‌ప్రింట్‌ డివైజర్లతోపాటు రూ.30వేల నగదును దొంగలు అపహరించినట్లు నిర్వాహకుడు తెలిపాడు. వీటితోపాటు డెస్క్‌లో ఉన్న ఆధార్‌ అప్‌డేషన్‌ పత్రాలు, పెద్దస్టాండ్‌ దొంగలు ఎత్తుకెళ్లినట్లు కేంద్రం నిర్వాహకుడు రమావత్‌ రాజా వాపోయాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.4లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. కాగా నల్లగొండనుంచి క్లూస్‌ టీంను పోలీసులు రప్పించి వెలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ మోతీరాం తెలిపారు.

గుడ్లు చోరీ... ఆమ్లెట్‌ తినేసి పరారీ

ఆత్మకూరు(ఎస్‌), జూలై 7(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతం ప్యాకెట్లు, గుడ్లు, నూనె ప్యాకెట్లు చోరీచేసిన దొంగలు ఆమ్లెట్‌ వేసుకుని తిని మరీ వెళ్లిపోయారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం నెమ్మికల్‌ అంగన్‌వాడీ రెండవ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. అంగన్‌వాడీ టీచర్‌ రేపాక పద్మ తెలిపిన వివరాల ప్రకారం నెమ్మికల్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలోని బీరువాలో కోడిగుడ్లు, బాలమృతం ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లను ఉంచి శనివారం సాయంత్రం తాళం వేసుకుని వెళ్లారు. ఆదివారం సెలవు కావడంతో తెరవలేదు. సోమవారం ఉదయం 8 గంటలకు కేంద్రాన్ని తెరిచేందుకు టీచర్‌ పద్మ, ఆయా భిక్షమమ్మ వెళ్లగా అప్పటికే తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. కేంద్రం లోపలికి వెళ్లి చూడగా సామాగ్రి చిందర వందరగా ఉంది. బీరువా తలుపులు రాడ్లతో తీసి 5 నూనె ప్యాకెట్లు, 4 బాలామృతం ప్యాకెట్లు, రెండు కోడిగుడ్లు ట్రేలు చోరీ చేసినట్లు గుర్తించారు. కొన్ని గుడ్లు పగిలి ఉండటం, అక్కడి గ్యాస్‌ స్టవ్‌ వద్ద మూడు గుడ్లతో ఆమ్లెట్‌ వేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఇదే విషయమై ఉన్నతాధికారులకు తెలియజేయడంతో సూపర్‌వైజర్‌ అన్నపూర్ణ కేంద్రాన్ని పరిశీలించారు. సుమారు రూ.1200 విలువైన సామగ్రి పోయిందని అంగన్‌వాడీ టీచర్‌ పద్మ ఇచ్చిన ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 12:32 AM