ఓటెత్తిన పల్లెలు...
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:29 AM
చివరి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. చివరి విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకాగా రాత్రి వరకు కొనసాగింది. అత్యధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు.
-మూడో విడుతలో భారీగా తరలివచ్చిన ఓటర్లు
-చెన్నూరు నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో పోలింగ్
-నాలుగు సర్పంచ్, 153 వార్డు స్థానాలు ఏకగ్రీవం
-98 సర్పంచ్, 711 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ
-ఓటు హక్కును వినియోగించుకున్న 93 వేల మంది
-మొత్తంగా 87.78 శాతం పోలింగ్ నమోదు
మంచిర్యాల, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): చివరి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. చివరి విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకాగా రాత్రి వరకు కొనసాగింది. అత్యధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాల వారీగా 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని మొత్తం 306 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాల్లో బీసీలకు 23, ఎస్సీలకు 117, ఎస్టీలకు 29, జనరల్‌కు 137 స్థానాలను కేటాయించారు. అలాగే వార్డు సభ్యుల్లో స్థానాల్లో ఎస్సీలకు 803, ఎస్టీలకు 253, బీసీలకు 334, జనరల్ కేటగరీకి 1290 స్థానాలను రిజర్వ్ చేశారు.
98 సర్పంచ్, 711 వార్డు సభ్యుల స్థానాలు...
మూడో విడుత పంచాయతీ ఎన్నికలు చెన్నూరు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని ఏడు మండలాల్లో జరిగాయి. నియోజక వర్గంలోని భీమారం, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా ఆయా మండలాల పరిధిలో మొత్తం 102 సర్పంచ్ స్థానాలు, 868 వార్డు సభ్యుల స్థానాలను అధికారులు గుర్తించారు. వాటిలో భీమారం మండలంలో 11 గ్రామ పంచాయతీ (జీపీ)లు ఉండగా, చెన్నూరు మండలంలో 30 జీపీలు, జైపూరు మండలంలో 20 జీపీలు, కోటపల్లి మండలంలో 31 జీపీలు, మందమర్రి మండలంలో 10జీపీలు ఉన్నాయి. ఐదు మండలాల్లోని 102 సర్పంచ్ స్థానాలకు గాను చెన్నూరు మండలం రచ్చపల్లి, కోటపల్లి మండలం ఏసన్వాయి, లక్ష్మీపూర్, మందమర్రి మండలం శంకరపల్లి పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవైన నాలుగు గ్రామాలు పోను మిగతా 98 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనుండగా, మొత్తం 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే తుది విడుతలో ఐదు మండలాల పరిధిలోని 98 పంచాయతీల పరిధిలో మొత్తం 868 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా, వాటిలో భీమారం మండలంలో మూడు వార్డులు, కోటపల్లి మండలంలోని ఒక వార్డుకు సంబంధించి వివిధ కారణాల వల్ల నామినేషన్లు దాఖలు కాలేదు. వాటితోపాటు ఏకగ్రీవమైన భీమారం మండలంలోని 23, చెన్నూరు మండలంలోని 45, జైపూర్ మండలంలోని ఆరు, కోటపల్లి మండలంలోని 58, మందమర్రి మండలంలోని 21 వార్డులతో కలిపి మొత్తం 153 స్థానాలకు ఎన్నికలు జరగ లేదు. మిగిలిన 711 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, మొత్తం 1905 మంది అభ్యర్థులు వార్డు సభ్యుల పదవుల కోసం పోటీ పడ్డారు.
87.78 శాతం పోలింగ్ నమోదు...
మూడో విడుతలో ఎన్నికలు జరిగిన చెన్నూరు నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 87.78 శాతం పోలింగ్ నమోదైంది. ఐదు మండలాల పరిధిలో మొత్తం 1,06,889 మంది ఓటర్లు ఉండగా 93,822 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పురుషులు 46,580 మంది ఉండగా, స్త్రీలు 47,240 మంది, ఇతరులు ఇద్దరు ఓటర్లు ఉన్నారు. ప్రారంభంలో కొంచెం మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ అనంతరం ఊపందుకుంది. ఓట్లు వేసేందుకు గ్రామస్థులు తరలి వచ్చారు. ఉదయం 9 గంటల వరకు 27.15 శాతం నమోదైన పోలింగ్, 11 గంటల వరకు 62.38 శాతానికి చేరింది. అలాగే సమయం ముగిసే సరికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 85.52 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటి వరకు క్యూ లైన్‌లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం 87.78కి చేరుకుంది.
మండలాల వారీగా నమోదైన పోలింగ్...
చెన్నూరు నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో అత్యధికంగా కోటపల్లి మండలంలో 89.65 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా జైపూర్ మండలంలో 85.80 శాతం పోలింగ్ నమోదైంది. భీమారం మండలంలో 88.19 శాతం, చెన్నూరు మండలంలో 87.84 శాతం, మందమర్రి మండలంలో 88.21 శాతం పోలింగ్ నమోదైంది.