Share News

కంపచెట్లు పెరిగి.. రక్షణ గోడలు లేక

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:15 AM

హైదరాబాద్‌ జంటనగరాలకు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగడంలేదు.

కంపచెట్లు పెరిగి.. రక్షణ గోడలు లేక

పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచని ఏఎమ్మార్పీ ప్రాజెక్టు

మొక్కుబడిగా కంపచెట్లు తొలగింపు

మరమ్మతులు పూర్తయ్యేదెన్నడో?

పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జంటనగరాలకు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగడంలేదు. గతంలో రక్షణ గోడ కుంగడంతో మోటర్లను ఆపివేసి ఇసుక బస్తాలు వేసి నీరులీకేజీ కాకుండా చేశారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని అధికారులు ఆదేశించినా ముందుకు సాగడం లేదు. నాగా ర్జునసాగర్‌ నీటిమట్టం ప్రస్తుతం 516అడుగులు ఉంది. 510అడుగులకు దిగువకు చేరితే అవసరమైన నీటిని మోటర్ల ద్వారా ఎత్తిపోసి హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగునీరు అందించడానికి హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు చర్యలు చేపట్టనుంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి జీరో పాయింట్‌ వద్ద 2024లో రూ.3కోట్లతో పనులు చేపట్టి 600 హెచ్‌పీ సామర్థ్యం గల ఐదు మోటర్లు, 300 హెచ్‌పీ సామర్థ్యం గల మరో ఐదు మోటర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి రోజుకు 900క్యూసెక్కుల నీటిని పుట్టగండి అప్రోచ్‌ కెనాల్‌లోకి ఎత్తిపోశారు. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 516అడుగులు ఉందని ఇప్పటివరకు ఇబ్బంది లేదని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. 2016, 2017, 2018, 2019, 2024లో వరుసగా మోటర్ల ఏర్పాటు చేసి సాగర్‌ నీటి మట్టం 500అడుగుల వరకు ఉన్నా నీటిని ఎత్తిపోశారు. కొన్ని సందర్భాల్లో మోటర్లకు నీరు అందకపోవడంతో నదిలో కాల్వ తవ్వి నీటిని పుట్టగండి మోటర్లకు అందించారు. ప్రస్తుతం నాలుగు మోటర్ల ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్‌ తరలిస్తున్నారు. అక్కడి నుంచి జంటనగరాలకు 525 కూసెక్కులు, మిషన్‌భగీరథ 45 క్యూసెక్కుల నీటిని, పానగల్‌ రిజర్వాయర్‌కు 1100క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.

రూ.9 కోట్లతో ప్రతిపాదనలు

పుట్టంగండి పంప్‌హౌస్‌, అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ చుట్టూ కంపచెట్లు ఏపుగా పెరిగి నీరు లీక్‌ అవడంతో గత సంవత్సరం రూ.9కోట్లతో కంపచెట్లను తొలగించారు. ఇంకా పూర్తిస్తాయిలో పనులు పూర్తికాలేదు. గత సంవత్సరం మొదటి యూనిట్‌ మరమ్మతులకు గురికావడలో రూ.1.5కోట్లతో మరమ్మతులు చేపట్టారు. గత సంవత్సరం నిర్వహణ కోసం జెన్‌కో అధికారులు రూ.8.84 కోట్లతో ప్రతిపాదనలు చేయగా అది మార్చితో ముగిసింది. 2025-2026 సంవత్సరానికి నిర్వహణ కోసం రూ. రూ.9 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.

చేయాల్సిన పనులు

గతంలో పుట్టంగండి నుంచి అక్కంపల్లి రిజర్వాయర్‌ వరకు 12 కిలోమీటర్ల దూరం కెనాల్‌కు లైనింగ్‌ మురమ్మతుల కోసం రూ.51 కోట్లు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. దీంతో పనులు ఇంకా ప్రారంభించలేదు. అలాగే ప్రధాన కాల్వలకు ఉన్న లింక్‌ కెనాల్‌లు కంపచెట్లతో నిండి ఉన్నాయి. దీంతో ఆయకట్టు చివరి వరకు నీరు చేరక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉంది. అలాగే కాల్వల లైనింగ్‌ మరమ్మతులు చేయాల్సి ఉంది. అదే విధంగా పూర్తిస్థాయిలో రక్షణ గోడలు నిర్మించాల్సి ఉంది.

Updated Date - Apr 08 , 2025 | 12:15 AM