బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:45 AM
నల్లగొ ండ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్‌కు గురైన 20 నెలల బాలుడిని ఏడు గంటల్లోనే పోలీసులు రక్షించారు.
ఏడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు
కిడ్నాప్‌కు పాల్పడిన ఇద్దరు మహిళల అరెస్టు
నల్లగొండ టౌన్, గుండాల, జూన్ 11(ఆంధ్రజ్యోతి): నల్లగొ ండ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్‌కు గురైన 20 నెలల బాలుడిని ఏడు గంటల్లోనే పోలీసులు రక్షించారు. బుధవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యా లయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బైరం భాగ్యలక్ష్మికి అనారోగ్యంతో ఉండటంతో ఈ నెల 8వ తేదీన ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆమెతోపాటు అదేరోజు భర్త అంజిబాబు, 20 నెలల వయస్సున్న కుమారుడు సామేశ్వర్‌కుమార్, బంధువు పార్వతమ్మతో వచ్చారు. వృత్తి రీత్యా ఆటోడ్రైవర్ అయిన అంజిబాబు స్వగ్రామానికి వెళ్లగా, కుమారుడు, బంధువు భాగ్యలక్ష్మి వద్ద ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం భాగ్యలక్ష్మి తన కుమారుడు, పార్వతమ్మతో ఆస్పత్రి ఆవరణలో ఉండగా, అక్కడికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని మహిళలు వారితో మాటలు కలిపారు. చిన్నారిని ఆడిస్తూ భోజనం చేసి రావా లని, అప్పటివరకు పిల్లాడిని పట్టుకుంటామంటూ నమ్మబలికారు. దీంతో వారు బాలుడిని ఆ మహిళలకు అప్పగించి భోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు మహిళలు, కుమారుడు కనపడకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆర్టీసీ బస్టాండు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించారు. సమాచారం సేకరించి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామం వద్ద ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఉన్న బాలుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు.
మగ సంతానం కావాలనే కోరికతోనే...
హైదరాబాద్‌లోని దమ్మాయిగూడకు చెందిన నారాయణదాసు, అరుణకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం అరుణ కుమారుడు మృతిచెందాడు. దీంతో ఆమె తమకు మగపిల్లాడు కావాలని, ఒక బాలుడిని తీసుకుని వచ్చి పెంచుకోవాలని ఉందని దమ్మాయిగూడలో తాను నివసిస్తున్న ఇంటి పక్కనే ఉన్న జంతిక సుక్కమ్మ అలియాస్ పాలడుగు సుగుణమ్మకు చెప్పింది. దీంతో అరుణ, సుగణమ్మ రద్దీగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు, ఆస్పత్రుల్లో పిల్లలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అక్కడినుంచి పిల్లవాడిని కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా వారిద్దరూ మంగళవారం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అక్కడ ప్రసూతి విభాగం ముందు బాలుడి తల్లి, వారితో వచ్చిన పార్వతమ్మతో మాటలు కలిపారు. బాలుడిని ఆడిస్తున్నట్లు నటిస్తూ భోజనం చేసిరావాలని, తాము చిన్నారిని ఆడిస్తామని నమ్మించారు. వారిద్దరూ భోజనానికి వెళ్లగా బాలుడిని తీసుకుని అక్కడినుంచి పారిపోయారు. డీఎస్పీ శివధర్‌రెడ్డి ఆఽధ్వర్యంలో ఏడు గంటల్లో కేసును ఛేదించిన టూటౌన్ సీఐ రాఘవారావు, నా ర్కట్‌పల్లి సీఐ నాగరాజు, టూటౌన్ ఎస్‌ఐ ఎర్ర సైదులు, సతీష్ , భువనగిరి టౌన్ సీఐ రమేష్, సిబ్బంది సాగర్ల శంకర్, బాలకోటి, జానకిరామ్, తిరుమలేష్‌ను జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్ అభినందించారు.