Share News

దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనది

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:49 PM

కుటుంబాన్ని తీర్చిదిద్దడంతో పాటు దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అన్నారు.

దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనది

అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌

కాసిపేట, మార్చి 20(ఆంధ్రజ్యోతి) : కుటుంబాన్ని తీర్చిదిద్దడంతో పాటు దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అన్నారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వయోజన విద్యా సఖి లయన్స్‌క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళ వారోత్స వాల ముగింపు వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలు సామాజికంగా తోడ్పాటునందిస్తున్నారన్నారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదిముర్ముతో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, నేవి, ఎయిర్‌ఫోర్స్‌, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారన్నారు. ప్రతి రంగంలో మహిళల పాత్ర కీలకమైనదని తెలిపారు. మహిళలు సాధిస్తున్న విజయాలకు గుర్తింపునిచ్చి మరింత ప్రోత్సహించాలన్నారు. మహిళలకు ఆత్మస్ధైర్యమే గొప్ప ఆయుధమని పేర్కొన్నారు. సావిత్రిబాయిపూలే మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారన్నారు. కాసిపేట మండలాన్ని వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుందన్నారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఆర్ధికంగా ఎదిగేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జిల్లా అల్పాసంఖ్యాక వర్గాల సంక్షేమాధికారి రాజేశ్వరి, లయన్స్‌క్లబ్‌ సఖి ప్రెసిడెంట్‌ బండ శాంకరి, ఏఈవో రమ్య, పంచాయతీ కార్యదర్శి మేఘన, మోటివేషన్‌ స్పీకర్‌ చైతన్య, డీఆర్‌పీలు సుమన్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:49 PM