kumaram bheem asifabad- ‘పంచాయతీ’ పోరు.. పల్లెల్లో జోరు
ABN , Publish Date - Dec 02 , 2025 | 10:29 PM
జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. మంగళవారంతో రెండో విడత నామినేషన్ల గడవు ముగిసింది. దీంతో ఆయా పార్టీల నాయకులు తమ వర్గం వారిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. ఈ నానుడినే నాయకులు ఒంట పట్టించుకున్నారు.
- ఏకగ్రీవాలకు ప్రయత్నాలు
- పదువుల పంపకాలకూ మొదలైన ఒప్పందాలు
- తమ వర్గం వారిని గెలిపించుకునేందుకు వ్యూహరచన
ఆసిఫాబాద్, డిసెంబరు 2 (ఆంద్రజ్యోతి): జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. మంగళవారంతో రెండో విడత నామినేషన్ల గడవు ముగిసింది. దీంతో ఆయా పార్టీల నాయకులు తమ వర్గం వారిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. ఈ నానుడినే నాయకులు ఒంట పట్టించుకున్నారు. జెండా లేని పల్లె సమరంలో ఇదే అజెండాను అమలు చేయనున్నారు. ఇన్నాళ్లూ నగరాలు, పట్టణాల్లో నివాసం ఉన్న వారు పంచాయతీకి సైరన్ మోగగానే పల్లెబాట పట్టారు. ‘ ఊరు’లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సామ ధాన బేధా దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. మెజార్టీ పంచాయతీల్లో ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీ తప్పదు అనుకున్న చోట గట్టి అభ్యర్థి కోసం వేట సాగిస్తున్నారు. అంతే కాకుండా పదవుల పంపకాలకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. మొత్తానికి జెండాల్లేని ఎన్నికల్లో అజెండా మాత్రం కనిపిస్తోంది.
- జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో మొత్తం 335 పంచాయతీలు, 2,874 వార్డులకు ఎన్నికలు జరగబోతుండగా తొలి విడత లో జైనూరు, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్ (యు), వాంకిడి మండలాలలోని 114 సర్పంచ్ స్థానాలు, 944 వార్డు స్థానాలకు, రెండో విడతలో బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల, పెంచికలపేట, సిర్పూర్(టి), దహెగాం మండలాల్లోని 113 సర్పంచ్ స్థానాలు, 992 వార్డులు, మూడో విడతలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండ లాల్లోని 108 సర్పంచ్ స్థానాలకు, 938 వార్డులకు, ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు మొజార్టీ పంచాయతీలు గెలిపించుకునే లక్ష్యంతో కింది స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. జిల్లాలో పంచాయతీ తొలి విడతకు నామినేషన్ ప్రక్రియ పూర్తికాగా. మలి దశలో కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్‌లోని ఆరు మండలాలైన సిర్పూర్(టి), కౌటాల, చింతలమానే పల్లి, బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం మండ లాల్లో నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. .ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా జిల్లా, మండల కేంద్రాల్లోని నాయకులు గ్రామాలకు కదులుతున్నారు. ఇప్పటి వరకు సొంత ఊర్లను వదిలి వ్యాపారం, పిల్లల చదువుల కోసం ప్రధాన పార్టీల నేతలు ఎక్కువ శాతం కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో ఇవాసం ఉంటూ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మండల స్థాయి నాయకులతో సమన్వయం చేసుకుని ఆయా గ్రామాల్లో పార్టీల మద్దతుదారులను గెలిపించేందుకు పల్లె వైపు కదులుతున్నారు. ఎన్నికల పుణ్యమాని హైదరాబాద్, మంచిర్యాల ఇతర పట్టణాలలో ఉన్న నాయకులు స్వగ్రామాలకు వస్తున్నారు.
- రంగంలోకి దిగేందుకు..
మొన్నటి వరకు వామ్మో పంచాయతీ ఎన్నికలా అంత డబ్బు పెట్టలేమన్న వారు కూడా ఇప్పుడు రంగంలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోలాహాలం ఊపందుకొంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఏకగ్రీవాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో ఏకగ్రీవానికి ఒప్పుకుంటే గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రభుత్యం నుంచి సంకేతాలు రావడంతో కొన్ని గ్రామాల్లో, తండాల్లో ఏకగ్రీవంపై తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకగీవ్రం పంచా యతీలకు ప్రభుత్వం రూ.10 లక్షలు నజరానా ప్రకటించడంతో ఆ నిధులతో మరింత అభివృద్ధి సాధించవచ్చని భావిస్తున్నారు.
- సమయం తక్కువగా ఉండడంతో..
నామినేషన్ గట్టం మొదలైన నేపథ్యంలో సమ యం తక్కువగా ఉండడంతో ఎలాగైనా పంచాయతీలను చేజిక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కులాలను, స్నేహబంధాలను, బంధుత్వాలను ఆసరాగా చేసుకుని బరిలో ప్రత్యర్థులను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొందరు డబ్బు ఆశ చూపించి రంగంలోంచి తప్పించే ప్రయత్నంలో ఉన్నారు. రిజర్వుడు పంచాయతీల్లో సర్పంచ్ పదవిని ప్రధాన పార్టీలకు వదిలి ఉప సర్పంచ్‌ని దక్కించుకొనేందుకు ద్వితీయ శ్రేణి పార్టీల నాయకులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు.
- మన జెండా ఎగిరితేనే..
మండల, జిల్లా, నేతలు సైతం తమ ఊరిలో మన జెండా ఎరిగితేనే పైస్థాయిలో పలుకుబడి ఉంటుందని పావులు కదుపుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలువాలన్న భావనతో నేతలు సొంత గ్రామాల్లో పార్టీ గెలిపించాలనే తపనతో ముందు కెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తేనే రాజకీయాల్లో మనుగడ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పంచాయతీ పోరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రధాన పార్టీల నాయకులకు పరీక్ష కాబోతున్నాయి. ఆయా పార్టీల నాయకులు గ్రామాల్లో తమకు అనుకూలమైన సర్పంచ్ ఉండాలన్న ఎజెండాతోనే మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.