kumaram bheem asifabad- పాడి బరువెక్కుతోంది
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:23 PM
వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువుల పెంపకంతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. పలువురు పాడి పశువులు, గేదెల ద్వారానే వచ్చే పాల దిగుబడులపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ప్రస్తుతం పశువులను పోషించడం తలకు మించిన భారమవుతుందని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. పోషణకు అవసరమైన పశుగ్రాసం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నా యి.
- తగినంత ఆదాయం లేక రైతుల అవస్థలు
జైనూర్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువుల పెంపకంతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. పలువురు పాడి పశువులు, గేదెల ద్వారానే వచ్చే పాల దిగుబడులపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ప్రస్తుతం పశువులను పోషించడం తలకు మించిన భారమవుతుందని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. పోషణకు అవసరమైన పశుగ్రాసం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నా యి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పాల సేకరణ ధరలను ప్రభుత్వం పెంచాల్సి ఉంది. కానీ ఇటీవల ప్రభుత్వం లీటరు ఆవు పాలను ఐదు రూపా యలు తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆవు పాలు లీటరుకు రు. 40 చొప్పున కొనుగోలు చేశారు. కానీ ఇటీవల ఒకే సారి ఐదు రూపాయలు తగ్గించారని పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. తగినంత ఆదాయం లేక పోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
- సేకరణ ధర తగ్గించడంతో..
ఆసిఫాబాద్ పాల సేకరణ కేంద్రంలో రోజుకు 3,000 లీటర్ల ఆవు పాలు వచ్చేవని, సేకరణ ధర తగ్గి పోవడంతో ఒక్క సారిగా 11 వందల లీటర్లకు పడి పోయిందని పాల సేకరణ చేసే ఉద్యోగులు చెబుతున్నారు. జైనూరు మండలంలో ప్రతి రోజు190 లీటర్ల పాలు రాగా, ప్రస్తుతం 70 లీటర్లకే పరిమితమైంది. ఇంతకు ముందు ఇక్కడ 22 మంది పాడి రైతులు పాలు ఆసిఫాబాద్‌కు తీసుకొచ్చేవారు. ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే పాలను తరలిస్తున్నారు. పాల ధర తగ్గడం పోషణ భారం పెరగడంతో పాడి రైతులు పశువులతో పాటు గేదెలను ఇతర ప్రాంతాల రైతులకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ధర తగ్గిన విషయంపై విజయ డెయిరీ మేనేజర్ నవీన్‌ను వివరణ కోరగా డెయిరీ రాష్ట్ర కార్యాలయంలోని ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఆవు పాలు లీటరుకు ఐదు రూపా యలు తగ్గించామని చెప్పారు. రైతుల ఇబ్బందులను ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇలా చేస్తే మేలు..
ప్రభుత్వం పాడి రైతులకు ఆదుకునేందుకు సబ్సిడీలను అందించాలి. ముఖ్యంగా పశుగ్రాసం, ఇతర దాణాలను సిబ్సడీపై అందిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. డెయిరీ ద్వారా సేకరించే పాల ధరను పెంచితే రైతులు ఆర్థికంగా గిట్టుబాటు అవుతుంది. దీంతో పాటు పాడి పశువుల పోషణ, నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించాలి.
రుణం తీసుకుని పాడి పశువుల పెంపకం..
- గుగ్గె మాధవ్, పాడి రైతు, జామిని
ప్రధానమంత్రి ఎంప్లాయీమెంట్ జనరేషన్ పథకం కింద రూ. 20 లక్షల రుణం తీసుకొని పాడి పశువులను పెంచుతున్నాను. గతంలో ప్రభుత్వ డెయిరీ తీసుకున్న ఆవు పాలకు లీటరుకు రూ. 40 ఇచ్చేవారు. ప్రస్తుతం లీటరుపై ఐదు రూపాయలు తగ్గించారు. ఒక్కొక్క ఆవుకు రోజుకు పత్తి గింజల పొడి, బెల్లం పానకంతో తయారు చేసిన పదార్థం, మొక్కజొన్న పిండి పశుగ్రాసానికి ధరలు విపరీతంగా పెరిగాయి. పాల వల్ల వచ్చే ఆదా యం తగ్గింది. కానీ పశుగ్రాసం ధరలు పెరిగాయి. దీంతో పశు పోషణ భారంగా మారింది. ప్రభుత్వం పాడి రైతులను ఆదుకోవాలి.