kumaram bheem asifabad- భోజనంలో మెనూ పాటించాలి
ABN , Publish Date - Jul 24 , 2025 | 10:44 PM
: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. రెబ్బెన మండలం వంకులంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం సందర్శించి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రెబ్బెన, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. రెబ్బెన మండలం వంకులంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం సందర్శించి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలన్నారు. ఆహారం తయారు చేసే సమయంలో తాజా కూరగాయాలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని తెలిపారు. అనంతరం మండలంలోని కైరిగాం గ్రామంలో పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి మందుల స్టాక్, ఆసుపత్రికి సంబంఽధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈయన వెంట వైద్య ఆరోగ్య శాఖ అధికారి సీతారం, తహసిల్దార్ సూర్య ప్రకాష్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను మండల విద్యాధికారులు ప్రతి రోజు విధిగా సందర్శించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎంఈఓలు, సెర్ప్ ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో సౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కొరకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులపై ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు దృష్టి సారించాలని, సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేచి చోట ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని తెలిపారు. 2వ విడత ఏక రూప దుస్తులు విద్యార్థులకు అందించేందుకు విద్యార్థుల కొలతలు తీసుకుని సిద్దం చేయాలని ఏపీఎంలను ఆదేశించారు. మొదటి విడతలో విద్యార్థులకు రూ.100కు ఏక రూప దుస్థులు అందించేందుకు డిక్లరేషన్ తీసుకోవాలని, దుస్తులు కుట్టిన మహిళా సంఘాల ఖాతాల్లో నిధులు త్వరగా జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని తెలిపారు.