kumaram bheem asifabad- కొలువుదీరిన గణనాథులు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:23 PM
మ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు అందుకోనున్న గణనాథులు జిల్లా వ్యాప్తంగా బుధవారం కొలువుదీరారు. భాజాభజంత్రీలు, మంగళహారతుల మధ్య ఎక్కడికక్కడ గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా వినాయక విగ్రహాల ప్రతిష్టాసన జరిగాయి. కొలువుదీరిన గణనాథులకు జిల్లా వ్యాప్తంగా ప్రముఖలు పూజలు నిర్వహిస్తున్నారు.
- మండపాల్లో భక్తుల ప్రత్యేక పూజలు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు అందుకోనున్న గణనాథులు జిల్లా వ్యాప్తంగా బుధవారం కొలువుదీరారు. భాజాభజంత్రీలు, మంగళహారతుల మధ్య ఎక్కడికక్కడ గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా వినాయక విగ్రహాల ప్రతిష్టాసన జరిగాయి. కొలువుదీరిన గణనాథులకు జిల్లా వ్యాప్తంగా ప్రముఖలు పూజలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో సంఘసేవ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ వినాయకుడ్ని ప్రతిష్టాపించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టాపించి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వమించారు. వన్‌నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్, బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్ష కోసం కృషి చేయడంలో భాగంగా జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్, మున్నూరు కాపు సంఘం, పద్మశాలి సేవా సంఘం, వాసవి క్లబ్‌ల ఆధ్వర్యంలో వేర్వేరుగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గణేష్ చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు తన నివాసంలో పూజలు చేశారు. అలాగే సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వివిధ కూడళ్లలో ప్రతిష్టించిన గణనాథుల వద్ద పూజలు నిర్వహించారు. పట్టణంలో ఉదయం నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మట్టివినాయక విగ్రహలను పంపిణీ చేశారు. కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా ఆధ్వర్యంలో మట్టివినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో గణనాథులు కొలువు తీరా రు. భాజాభజంత్రీల మధ్య వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాలను వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఆలయాల్లో, ప్రధాన కూడళ్లలో గణనాథులను భాజాభజంత్రీల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. పలు మండపాల వద్ద నిత్య అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగావినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేధపండితుల మంత్రోచ్చారణలతో గణనాథులను ప్రతిష్ఠించారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో వినాయక చవితి పురస్కరించుకుని బుధవారం గణనాథులు కొలువు తీరారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవాలు బుధవారం మండ లంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలో బుధవారం జాగృతి జిల్లా అధ్యక్షుడు కిరిమిల్ల వినోద్ మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాగృతి కమిటీ సభ్యులు రాకేష్, మోసిన్, చిందం రాజు, కమలాకర్, తిరుపతి పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో వినాయకులను ప్రతిష్ఠించారు. మండల కేంద్రంలోని సర్వజనిక్ గణేష్ మండలి అధ్వర్యంలో వినాయక ఉత్సవాలను గ్రామ పటేల్ ఆత్రం ఆనంద్‌రావు, మండలి సభ్యులతోపాటు ఎస్సై రామకృష్ణా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో గణ నాథులు కొలువు దీరారు. శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రులు నిర్వహించు కోవాలని ఎస్సై రవికుమార్ సూచించారు.