Share News

Hidma: గెరిల్లా గుండెలయ హిడ్మా

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:59 AM

మడివి హిడ్మా...ఈ పేరు నిన్నటిదాకా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ పెద్ద సవాల్‌. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం పనిచేస్తున్న సీఆర్పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌, డీఆర్‌జీ, ఇతర బలగాలకు ఈ ఆదివాసీ నేత వేసే వ్యూహాలంటే వెన్నులో వణుకు. దండకార ణ్యం ఆయనకు ఇల్లు లాంటిది.....

Hidma: గెరిల్లా గుండెలయ హిడ్మా

  • దండకారణ్యంలో అలజడి రేపిన ఆదివాసీ నేత.. సాధారణ వ్యక్తిగా మొదలై మిలిటరీ చీఫ్‌గా ఎదిగి

  • 17 ఏళ్లకే దళంలోకి..మిలిటరీపై గట్టి పట్టు.. వ్యూహం పన్నాడంటే రక్తపుటేరులే

  • పీఎల్‌జీఏ సేనానిగా దయలేకుండా దాడులు

  • తాడిమెట్లలో 73 మంది జవాన్ల హత్య..

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మడివి హిడ్మా...ఈ పేరు నిన్నటిదాకా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ పెద్ద సవాల్‌. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం పనిచేస్తున్న సీఆర్పీఎఫ్‌, గ్రేహౌండ్స్‌, డీఆర్‌జీ, ఇతర బలగాలకు ఈ ఆదివాసీ నేత వేసే వ్యూహాలంటే వెన్నులో వణుకు. దండకార ణ్యం ఆయనకు ఇల్లు లాంటిది. ఎక్కడి నుంచి మొదలుపెట్టి...ఎక్కడ ముగించాలో ఆయనకు తెలుసు. 2004 నుంచి 2025 ఏప్రిల్‌ వరకు దండకారణ్యంలో జరిగిన వరుస సంఘటనలతో హిడ్మా వణుకు పుట్టించాడు. గెరిల్లా యుద్ధరంగంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ బలగాలతో పోరాడుతున్న పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ముఖ్యనేత హిడ్మా. చివరకు ఏపీ గ్రేహౌండ్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి పీఎల్‌జీఏ కార్యకలాపాలపైనే ఎక్కువగా ఆధారపడింది. దాన్ని ముందుండి నడిపించే సేనానే ఎన్‌కౌంటర్‌ కావడం ఆ పార్టీకి కోలుకోలేని షాక్‌ ఇచ్చిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఎవరీ హిడ్మా?

2017లో మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పిడి భారీగా జరిగింది. కేంద్ర కమిటీ కార్యదర్శిగా గణపతి తప్పుకొని ఆ బాధ్యతలను బస్వరాజ్‌కు (నంబాల కేశవరావు) అప్పగించారు. బస్వరాజ్‌ అప్పటివరకు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ బాధ్యతలను చూశారు. ప్రధాన నాయకత్వంలోకి వెళుతూ...ఆ బాధ్యతలను తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీకి ఆయన అప్పగించారు. ఇదే సమయంలో.. అప్పటిదాకా దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మాను కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 21వ తేదీన బస్వరాజ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత దేవ్‌జీ ఆయన స్థానంలో ప్రధాన కార్యదర్శి అయ్యారని, అప్పటివరకు ఆయన చూసిన బాధ్యతలను హిడ్మాకు పార్టీ అప్పగించిందని ప్రచారం జరిగింది. హిడ్మా అసలు పేరు హిడ్మాలు. నిజానికి మడ్కం హిడ్మా పేరుతో దండకారణ్య రీజనల్‌ కమిటీలో ఓ సభ్యుడు ఉండేవాడు. ఆయన మరణం తర్వాత హిడ్మాలు పేరును హిడ్మాగా పార్టీ మార్చింది. 1981లో ఛత్తీ్‌సగఢ్‌లోని దక్షిణ సుకుమా జిల్లా పువర్తిలో హిడ్మా జన్మించాడు. తల్లి బిజ్జూ ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉండగా, హిడ్మా చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. హిడ్మా ఐదో తరగతి వరకే చదివాడు. 17 ఏళ్ల వయసులో హిడ్మా సాయుధబాట పట్టాడు. నాటి దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ నేత రామన్నకు శిష్యుడిగా ఎదిగాడు. 2004లో మావోయిస్టు పార్టీ ఆవిర్భావం అనంతరం, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీలో (పీఎల్‌జీఏ) క్రియాశీల వ్యక్తిగా మారాడు. దండకారణ్యంలో కీలక దాడుల కోసం మెరికల్లాంటి మిలీషియాతో పీఎల్‌జీఏ విభాగంలో ఏర్పాటుచేసిన బెటాలియన్‌-1కు ఆయనను తీసుకున్నారు. ఈ బెటాలియన్‌లో 185 మంది గెరిల్లా సభ్యులు ఉండేవారు. దాడుల్లో పాల్గొనే స్థాయి నుంచి చివరకు దాడులకు వ్యూహాలు రచించి అమలు చేసే స్థాయికి హిడ్మా ఎదిగాడు. చివరకు దానికి చీఫ్‌ కమాండర్‌గా ఎదిగాడు.


బలగాలపై భయంకర దాడులు

బెటాలియన్‌-1తో దండకారణ్యం పరిధిలో ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా, బీజాపూర్‌, దంతేవాడలో హిడ్మా దారుణమైన సంఘటనలకు తెగించాడని పోలీసువర్గాలు చెబుతున్నాయి. బాంబులను ఉపయోగించే స్థాయి నుంచి వాటిని తయారు చేసే దాకా నైపుణ్యం పొందాడని అంటున్నారు. 2010లో మావోయిస్టులు డీకే పరిధిలోని తాడిమెట్లలో భద్రతా బలగాలపై దాడులు జరిపి 73 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు, అధికారులను అంతమొందించారు. 2013లో సల్వాజుడుం అధినేత, కాంగ్రెస్‌ నేత మహేంద్ర కర్మతోపాటు మరో 23 మందిని హతమార్చారు. 2017లో బుర్కాపూల్‌ అంబుష్‌ దాడిలో 23 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను చంపేశారు. దండకారణ్యంలో మావోయిస్టు గెరిల్లా చర్యలు, ప్రత్యేకించి హిడ్మా నేతృత్వంలోని బెటాలియన్‌-1 చర్యల వల్ల 2015లో 120 మంది, 2017లో 160 మంది, 2018లో 87 మంది, 2019లో 65 మంది, 2020లో 42 మంది సీఆర్పీఎఫ్‌ బలగాలు మరణించాయని రికార్డులు చెబుతున్నాయి. పెద్దగా అక్షర జ్ఞానం లేకపోయినా ఆయుధాల వినియోగం, తయారీతోపాటు బాంబుల తయారీలో హిడ్మా దిట్ట. నాటు బాంబుల నుంచి ఐఈడీల వరకు ఎలా తయారు చేయాలి? ఎలా పేల్చాలన్న అంశాలపై అతను నిరంతరం పీఎల్‌జీఏ బలగాలకు టెక్నికల్‌ శిక్షణ ఇస్తుంటాడని చెబుతున్నారు. ఏడేళ్ల క్రితం డీకేలో సీఆర్పీఎ్‌ఫపై జరిగిన ల్యాండ్‌మైన్‌, ఆపై ఫైరింగ్‌ దాడిని మావోయిస్టులు వీడియో తీశారు. ఆ దాడి చాలా ఉగ్రరూపంలో కొనసాగింది. 14 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందితోపాటు ఎనిమిది మంది పోలీసులు మరణించారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష మార్గనిర్దేశం హిడ్మానే ఇచ్చాడని సీఆర్పీఎఫ్‌... కేంద్రానికి సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది. గిరిజనులు వాడే సంప్రదాయ విల్లంబులు, ఆయధాలను టెక్నికల్‌గా సూపర్‌ఫైన్‌ చేసి వాటిని మినీ రాకెట్‌ లాంచర్లుగా ఆయన అభివృద్ధి చేశాడని తెలిసింది.

భీకర దాడులకు వ్యూహకర్త

తాడిమెట్లలో ఐఈడీ బాంబులు పేల్చి 2010లో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చంపేసిన ఘటనతో హిడ్మా పేరు బయటకొచ్చింది. అప్పటినుంచి హిడ్మా ఎలా ఉంటాడు....ఎలా ఉనికి కనిపెట్టాలన్నదానిపై సీఆర్పీఎ్‌ఫతోపాటు ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఏపీ, తెలంగాణ బలగాలు చేయని ప్రయత్నం లేదు. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్‌ నేత మహేంద్ర కర్మతోపాటు 23మంది నేతల హత్య తర్వాత ఈ వేట మరింత ఎక్కువయింది. లొంగిపోయిన నేతలు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసు బలగాలు హిడ్మా ఆనుపానులపై కొన్ని స్కెచ్‌లు వేశాయి. ఒక దశలో హిడ్మా లొంగిపోతున్నాడని, మరో సందర్భంలో అరెస్టు అయ్యాడనే ప్రచారం కూడా చేశారు. అవీ ఫలితమివ్వలేదు. ఆదివాసీలు, గిరిజనుల్లో ఆయనకు బాగా పట్టుంది. పోలీసులు అంత సులువుగా ఆయన వద్దకు చేరుకోలేరు. ఫీల్డ్‌ కూంబింగ్‌ ద్వారా ఆయనను చేరుకోవడం ఇప్పటిదాకా జరగలేదు. చివరకు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని మరేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా పోలీసు బలగాల చేతుల్లో హతమయ్యాడు.


కర్రెగుట్టలో మిస్‌ అయినా ఏపీలో చిక్కాడు..

తెలంగాణ - ఛత్తీ్‌సగఢ్‌ అటవీప్రాంతంలోని కర్రెగుట్టలు గత కొంతకాలంగా హిడ్మాకు అడ్డాగా మారాయి. అయితే, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని కూడా ఛేదించడంతో ఆయన తన మకాంను తొలుత ఏఓబీకి, అక్కడి నుంచి ఏపీకి మార్చినట్లుగా తెలుస్తోంది. ఏపీలోకి గత నెల 28నే వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వారి కదలికలపై పోలీసులకు సమాచారం అంది ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో గత 14 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమం లేదు. కూంబింగ్‌ ఆపరేషన్స్‌ కూడా బాగా తగ్గిపోయాయి. ఈ నేపఽథ్యంలో ఏపీని సేఫ్‌జోన్‌గా భావించి హిడ్మా వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. కర్రెగుట్టల ఆపరేషన్‌ నుంచి తప్పించుకున్నా ఆయన ఏపీలో పోలీసులకు చిక్కడం అంతుచిక్కని అంశంగా ఉందని ప్రజాసంఘాలు అంటున్నాయి.

సుకుమా ప్రాంతంలో క్రియాశీలక ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్‌గా మొద లైన హిడ్మా ప్రస్థానం ఆ తర్వాత దళ సభ్యుడిగా, యాక్షన్‌ టీమ్‌ ఇన్‌చార్జి దాకా ఎదిగాడు. హిడ్మాకు గోండి, హిందీ, బెంగాలీ, కోయ, ఒడియా, కోయ భాషలు వచ్చు. దండకారణ్యంలోని 18 ఆదివాసీ తెగల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా కేంద్ర కమిటీకి ఎదిగిన తొలి ఆదివాసీ కూడా హిడ్మాయే. మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్‌ జరుగుతోందంటే ఆ ప్రాంతాలను ఖాళీ చేయడం సర్వసాధారణం. హిడ్మా శైలినే వేరు. తాము ఫలానా అటవీ ప్రాంతంలో ఉన్నామని

అగ్రనేతగా ఎదిగిన తొలి ఆదివాసీ

సుకుమా ప్రాంతంలో క్రియాశీలక ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్‌గా మొద లైన హిడ్మా ప్రస్థానం ఆ తర్వాత దళ సభ్యుడిగా, యాక్షన్‌ టీమ్‌ ఇన్‌చార్జి దాకా ఎదిగాడు. హిడ్మాకు గోండి, హిందీ, బెంగాలీ, కోయ, ఒడియా, కోయ భాషలు వచ్చు. దండకారణ్యంలోని 18 ఆదివాసీ తెగల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా కేంద్ర కమిటీకి ఎదిగిన తొలి ఆదివాసీ కూడా హిడ్మాయే. మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్‌ జరుగుతోందంటే ఆ ప్రాంతాలను ఖాళీ చేయడం సర్వసాధారణం. హిడ్మా శైలినే వేరు. తాము ఫలానా అటవీ ప్రాంతంలో ఉన్నామని భద్రతా బలగాలకు లీకులు పంపించి వారిని మాటువేసి చంపుతాడని పోలీసువర్గాలు చెబుతున్నాయి. దంతేవాడ (2010) బీజాపూర్‌ (2011) జైరామ్‌ ఘాటీ (2013), బీజాపూర్‌-సుకుమా ఏరియా దాడులు(2021)ఈ కోవకు చెందినవే. కూంబింగ్‌ ఆపరేషన్లలో ఉన్న భద్రతా బలగాలను దారి మళ్లించి, వారికి తనే ఓ అడ్డాను చూపించి, వారు అక్కడికి చేరుకునే క్రమంలో మాటువేసి విల్లంబులు, బాంబులు, ఐఈడీలతో విరుచుకుపడి ఊచకోతలు కోసినసందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే హిడ్మా ఉన్నాడన్న సమాచారం చేరిందంటే ఒకటికి పది సార్లు తనిఖీ చేసుకున్నాకే ఆ దిశగా బలగాలు కదిలేవి. 2023 జనవరిలో బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బెటాలియన్‌ 1లోని 11 మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అందులో హిడ్మా ఉన్నాడని ప్రచారం జరిగింది. కానీ, దాడికి కొద్ది నిమిషాల ముందే అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నట్లు ఆ తర్వాత బలగాలు గుర్తించాయి. మవోయిస్టు పార్టీకి సొంత క్యాడర్‌, ప్రజాసంఘాల ద్వారా డీకే పరిధిలో సొంత నిఘా వ్యవస్థ ఉంటుంది. అవి కాకుండా హిడ్మాకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఉందని చెబుతున్నారు. తనకోసం బలగాలు రాబోతున్నాయని ముందుగానే తెలుసుకొని ప్రతి దాడులకు సిద్ధమయ్యేలా ఆయన దండకారణ్యంలో ఎదిగారు.

Updated Date - Nov 19 , 2025 | 04:59 AM