kumaram bheem asifabad- తేలని ఈఎస్‌ఐ ఆసుపత్రి భవితవ్యం
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:47 PM
కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి భవిష్యతవ్యం ఇంకా తేలడం లేదు. గతమెంతో ఘనం.. ప్రస్తుతం దయనీయం అన్న చందంగా మారింది కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి పరిస్థితి. ఒకప్పుడు వందలాది మంది రోగులతో కిటకిటలాడగా ప్రస్తుతం ఒక్క ఇన్‌పెషెంట్ లేని పరిస్థితి. కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం, సర్‌సిల్క్ మిల్లు కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 50 ఏళ్ల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మించారు. ఇప్పుడు భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో ఇక్కడి అధికారులు భవన పరిస్థితిపై పరిశీలించాని సూపరింటెండెంట్ ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు లేఖలు రాశారు.
- కొత్త భవన నిర్మాణానికి నిధులు కోసం నిరీక్షణ
- ఎటూ తేల్చని రాష్ట్ర ప్రభుత్వం
కాగజ్‌నగర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి భవిష్యతవ్యం ఇంకా తేలడం లేదు. గతమెంతో ఘనం.. ప్రస్తుతం దయనీయం అన్న చందంగా మారింది కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి పరిస్థితి. ఒకప్పుడు వందలాది మంది రోగులతో కిటకిటలాడగా ప్రస్తుతం ఒక్క ఇన్‌పెషెంట్ లేని పరిస్థితి. కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం, సర్‌సిల్క్ మిల్లు కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 50 ఏళ్ల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మించారు. ఇప్పుడు భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో ఇక్కడి అధికారులు భవన పరిస్థితిపై పరిశీలించాని సూపరింటెండెంట్ ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు లేఖలు రాశారు. అలాగే సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని గతంలో పలుమార్లు సంబంఽధిత మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత ఎనిమిది నెలల క్రితం కూడా కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, బృంద సభ్యులు భవనానికి సంబంఽధించిన వాటిపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు. ఉద్యోగుల నివాస గృహాలు నివాస యోగ్యంగా లేవని తేల్చారు. అలాగే భవనం కూడా శిథిలావస్థకు చేరినట్టు నివేదికలను రూపొందించారు. ఈ సమస్యలపై ఉద్యోగులతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు.
- డిస్పెన్సరీ ద్వారా సేవలు..
కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిని తొలగించి ఇక డిస్పెన్సరీ ద్వారా సేవలు అందించేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ప్రస్తుతం కేవలం 19వేల కార్డులు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రిగా సేవలు కొనసాగించాలంటే కనీసం 30 వేల కార్డులు అవసరం ఉంటుంది. డిస్పెన్సరీ ద్వారా సేవలు అందిస్తే కార్మికులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి ఉంటే రాత్రిళ్లు ప్రమాదాలు జరిగితే అడ్మిట్ చేసుకునే అవకాశాలుంటాయి. డిస్పెన్సరీలో ఈ అవకాశం ఉండదు. అలాగే ఈఎస్‌ఐ ఆసుపత్రి తొలగిస్తే సిబ్బందిని ఎక్కడకు బదిలీ చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇన్నాళ్లు సేవలు అందించి మరో చోటికి పోతే తమ భవిష్యత్తు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 30 మంది సిబ్బంది పని చేస్తున్నారు. జిల్లాలోనే అతి పెద్ద ఆసుపత్రి సేవలు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించకూడదని కార్మికులు చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రి స్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తే ఈ ప్రాంత కార్మికులకు మరిన్ని సేవలు అందించే అవకాశం మెండుగా ఉంది. వర్షాకాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని సిబ్బంది బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఈ విషయమై ఈఎస్‌ఐ సూపరింటెండెంట్ డాక్టర్‌జగన్‌ను వివరణ కోసం కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి సమస్యపై ఈఎస్‌ఐ కార్పోరేషన్‌కు వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు.
కార్మికులు న్యాయం చేయాలి..
- సూర్యప్రకాష్ ట్రేడ్ యూనియన్ నాయకుడు
ప్రభుత్వం ఈఎస్‌ఐ ఆసుపత్రి విషయంలో కార్మికులకు న్యాయం చేయాలి. వర్షాకాలంలో భవనం ఉరుస్తోంది. భవనం శిథిలావస్థకు వచ్చినట్టు అధికారులు తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే కొత్త భవనం నిర్మించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలి.