kumaram bheem asifabad- పోడు భూముల రైతుల తరలింపు ఉద్రిక్తం
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:07 PM
పోడు భూములు అటవీ అధికారులు తీసుకోకుండా తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న కుమరం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్థులను గురువారం పోలీసులు అల్వాల్ సమీపంలో అరెస్టు చేశారు.
- అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలింపు
- కౌటాల పోలీసుస్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన
కౌటాల, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పోడు భూములు అటవీ అధికారులు తీసుకోకుండా తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న కుమరం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్థులను గురువారం పోలీసులు అల్వాల్ సమీపంలో అరెస్టు చేశారు. అరెస్టు చేసి గ్రామస్థులను స్వగ్రామానికి ప్రత్యేక బస్పుతో తరలిస్తుండగా విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కాగజ్‌నగర్ సమీపంలో పోడు రైతులను తీసుకువస్తున్న వాహనాన్ని అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు రోడ్డుపై బైఠాయించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కౌటాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోడు రైతులను కొందరిని ఆసిఫాబాద్, వాంకిడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రవీణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు కౌటాల పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. వాళ్లను పోలీసులు గేటు బయట నిలిపివేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కుమరం భీం చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సాయంత్రం ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పోలీసులు వదిలి పెట్టారు. మరో వైపు తమ ఊరి వాళ్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిన దిందా గ్రామస్థులు వాల్ల దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని గ్రామ పొలిమే రలో నిలిపి వేశారు. సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై నగేష్, కమలాకర్, విజయ్, సాగర్‌లు బందో బస్తు నిర్వహించారు. సాయంత్రం వరకు దిందా పోడు రైతుల విషయంలో పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు.
బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో
కాగజ్‌నగర్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లి మండలం దిందాకు చెందిన పోడు రైతులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డాడానగర్ చౌరస్తాలో గురువారం రాస్తారోకో చేపట్టారు. పోడు సమస్యను పరిష్కరించాలని దిందాకు చెందిన పోడు రైతులు గత పది రోజుల క్రితం కాలినడకన ఛలో హైదరాబాద్‌కు వెళ్లుతుండగా గురువారం హైదరాబాద్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. దిందాకు కాగజ్‌నగర్ డాడానగర్ మీదుగా తరలిస్తుండగా, వీరికి న్యాయం చేయాలని వాహనాన్ని అడ్డుకొని రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకో చేస్తున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌటాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సిర్పూరు నియోజకవర్గ కన్వీనర్ శ్యాంరావు, ముస్తాఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
దందా గ్రామస్థుల అడ్డగింత
చింతలమానేపల్లి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని దిందా గ్రామస్థులను పోలీసులు గురువారం అడ్డుకున్నారు. గ్రామ పోడు రైతుల పాదయాత్రలో భాగంగా హైదరాబాద్ సమీపంలో గురువారం అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోడు రైతులను గ్రామానికి పోలీసులు తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు స్థానికులు వారికి మద్దతు ఇవ్వడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో బయటకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు గ్రామస్థులు వాపోయారు.