తీరనున్న సొంతింటి కల
ABN , Publish Date - May 27 , 2025 | 11:19 PM
కాంగ్రెస్ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప థకం త్వరలో పట్టాలెక్కనుంది. జూన్ 2న రాష్ట్ర అవ తరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావి స్తుండగా, అందుకు జిల్లాలోనూ అధికారులు సన్న ద్ధం అవుతున్నారు.
-జిల్లాకు మొదటి విడతలో 2150 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
జూన్ 2 నుంచి పంపిణీకి సిద్ధపడుతున్న ప్రభు త్వం
-ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
-గందరగోళంలో డబుల్ బెడ్రూం ఇళ్ల భవితవ్యం
మంచిర్యాల, మే 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప థకం త్వరలో పట్టాలెక్కనుంది. జూన్ 2న రాష్ట్ర అవ తరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావి స్తుండగా, అందుకు జిల్లాలోనూ అధికారులు సన్న ద్ధం అవుతున్నారు. దీంతో సొంత ఇంటి కోసం ఎదరు చూ స్తున్న గూడు లేని నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నా యి. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో సొంత స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆ విభాగంలోని వారికి మొదట లబ్ది చేకూరనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు ప్ర కటిం చింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దపడుతోంది.
14వేల ఇళ్లు మంజూరుకు అవకాశం....
జిల్లాలో ఇళ్లు లేనివారి సంఖ్య వేలల్లోనే ఉంది. జి ల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉం డగా, ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండ లం కూడా జిల్లా పరిధిలోకే వస్తుంది. ఒక్కో నియోజ కవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిం చారు. ఈ లెక్కన జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాలతోపాటు జన్నారం మండలానికి కలిపి మొత్తం సుమారు 14వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటికి తోడు రిజర్వుడ్ కోటా కింద మరికొన్ని ఇళ్లు కూడా ప్రభుత్వం మం జూ రు చేయనుంది. రిజర్వ్ కోటా ఇళ్లు జిల్లా కలెక్టర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యేల ఆధీనంలో ఉంటా యి. అవసరాన్ని బట్టి అర్హులైన వారికి వాటిని అప్ప టికప్పుడు మంజూరు చేసే వెసులుబాటు కల్పించారు.
జిల్లాకు 2150 ఇళ్లు మంజూరు....
మొదటి విడుతలో భాగంగా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు మొత్తంగా 2150 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని మూడు నియోజక వ ర్గాలతోపాటు జన్నారం మండలంలోని లబ్దిదారులకు వాటిని పంపిణీ చేయనున్నారు. జిల్లాకు మంజూరైన వాటిలో ఇప్పటి వరకు 914 ఇళ్ల నిర్మాణం ప్రారం భమైంది. వాటిలోనూ 179 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో ఉం డగా, మూడు రూఫ్ లెవల్లో నిర్మాణం కొనసాగుతు న్నాయి. కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతోపాటు స్థలాల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,10,206 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం....
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక తుది నిర్ణయా న్ని ప్రభుత్వం ఎమ్మెల్యేలకే వదిలి పెట్టింది. ప్రతీ ని యోజవర్గంలో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ప్రక్రియ మొ త్తం ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో ద్వితీయశ్రేణి నాయకులు తమకు అనుకూలంగా ఉండే వారికి ఇళ్లు కేటాయిం చేలా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. అర్హులైన వారు స్థానిక నాయకుల మద్దతు పొందాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో డబుల్ ఇళ్ల మంజూరు బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. అ యినా రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో పథకం నిర్వీర్యం అయింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల చేతిలో ఆ ప్రక్రియ ఉం డటం, గ్రామాలు, వార్డుల్లో స్థానిక నాయకుల హవా నడవనుండటంతో అర్హులకు ఇళ్లు అందుతాయా... ? అనే సందేహాలు కలుగుతున్నాయి.
రిజర్వేషన్ దామాషాన...
ప్రజా పాలనలో మహిళల పేరుతో వచ్చిన దరఖా స్తులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు తెలు స్తోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటంతోపాటు అం దులో పేరు ఉన్న మహిళలకు ఇళ్లు మంజూరు చేయా లనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. వివిధ వర్గాలకు రిజర్వేషన్ దామాషాన ఇళ్ల మంజూరు జరుగనుంది. దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ మైనార్టీలకు 50 శాతం, జనరల్ కోటాలో 15 శా తం ఇళ్లు కేటాయించనున్నారు. గతంలో ఇళ్లు మంజూరైనా, దళితబం ధు పథకం పొందిన దరఖాస్తులను తిరస్కరిస్తారు. అలాగే శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి పన్ను రశీదు, విద్యుత్ బిల్లు చూపాల్సి ఉంటుంది. సొంత స్థలం కనీసం ఒక గుంట పట్టా కలిగి ఉండాలి. మం జూరు పత్రాలు అందిన తరువాత ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకో వచ్చు. బేస్‌మెంట్ నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో నగదు చెల్లించనున్నారు.
డబుల్ ఇళ్ల పరిస్థితి ఏమిటో....?
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప థకం అర్థాంతరంగా ముగిసింది. పథకంలో భాగంగా జిల్లాకు మొత్తం 2616 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో మంచిర్యాల ని యోజకవర్గానికి 650 ఇండ్లు మంజూరు కాగా మొత్తం ఇళ్లను జిల్లా కేం ద్రానికి కేటాయించారు. వీటిలో ఇప్పటి వరకు 360 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా రెండు విడుత లుగా లబ్దిదారులకు లక్కీ డ్రా ద్వారా పంపిణీ చేశా రు. చెన్నూరు నియోజకవర్గానికి 1146 మంజూరుకాగా, వాటిలో మంద మర్రిలో 560, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి 286, చెన్నూరుకు 300 ఇండ్లు కేటాయించారు. వాటిలో 194 ఇళ్లు మినహా, మిగతా వాటి నిర్మాణం దా దాపుగా పూర్తయింది. అయినప్పటికీ చెన్నూరులో లబ్ధిదారుల ఎంపిక చే పట్టనేలేదు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గానికి 425 ఇళ్లు మంజూరు కాగా, పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఇదిలా ఉండగా, ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట్లలో కూడా పంపిణీకి నోచుకో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఇందిరమ్మ ఇళ్లపై దృష్టిసారించింది. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రస్తావన ప్రభుత్వంగానీ, అధికారులుగానీ తీయడం లేదు. దీంతో లక్షలు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.