పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా చేపట్టాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:28 PM
పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని రేపల్లెవాడలోని మహేశ్వరి కాటన్ జిన్నింగు మిల్లును సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
తాండూర్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని రేపల్లెవాడలోని మహేశ్వరి కాటన్ జిన్నింగు మిల్లును సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సీసీఐ ద్వారా రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. ఈ సారి రైతుల సౌకర్యార్ధం కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ సంవత్సరం క్వింటాలు పత్తికి రూ. 8,110 మద్దతు ధర ఉందన్నారు. అధిక దిగుబడి సాధించిన రైతులు తమ పరిధిలోని ఏఈవోల వద్ద ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి ధృవీకరించుకోవాలని, పంట ఉత్పత్తి ఆధారంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని కొనులు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వహకులు ఉన్నారు.