kumaram bheem asifabad- స్థానిక పోరుకు మోగిన నగారా
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:11 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం రాత్రి ప్రకటిం చింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిణి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత డిసెంబరు 11న, రెండో విడత డిసెంబరు 14న, మూడో విడత డిసెంబరు 17న పోలీంగ్ నిర్వహించనున్నారు.
- మూడు విడతల్లో ఎన్నికలు
- అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
- పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు
- జిల్లాలో 3,53,895 మంది ఓటర్లు
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యో తి): గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం రాత్రి ప్రకటిం చింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిణి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జిల్లాలో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత డిసెంబరు 11న, రెండో విడత డిసెంబరు 14న, మూడో విడత డిసెంబరు 17న పోలీంగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు మఽధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహి ంచి ఫలితాలను వెల్లడించన్నుట్లు తెలిపారు. మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
మూడు విడతల్లో....
మొదటి దశలో జరిగే మండలాలు: వాంకిడి, కెరమెరి, జైనూరు, సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లోని 114 గ్రామపంచాయతీలు, 944 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.రెండో దశలో జరిగే మండలాలు: బెజ్జూరు, దహెగాం, చింతలమానేపల్లి, కౌటాల, పెంచికల్‌పేట, సిర్పూర్ (టి) మండలాల్లోని 113 గ్రామపంచాయతీలు, 992 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడో దశలో జరిగే మండలాలు: ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల్లోని 108 గ్రామ పంచాయతీలు, 938 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
అభ్యర్థుల ఎంపికపై..
అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు వివిధ పార్టీల అధిష్ఠానాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలపై ద్వితీయ శ్రేణి నాయకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. బరిలో నిలిచే ఆయా పార్టీలకు చెందిన ఆశావాహులు ఆధిష్ఠానం, ఓట ర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమ య్యారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తదితర పార్టీలు అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై మండల పార్టీ ప్రతినిధులు, గ్రామాల నేతలతో తెరవెనుక సమాలోచనలు చేస్తున్నారు.
- జిల్లాలో 2,874 వార్డులు..
జిల్లాలో 335 గ్రామపంచాయతీ పరిధిలో 2,874 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో మొత్తం 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పంచాయతీలు, వార్డుల వారిగా ఓటరు జాబితాను ప్రకటించింది. ప్రభుత్వం తాజగా ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేయడంతో సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు కసరర్తు పూర్తి చేశారు. గతంలో బీసీలకు 42 శాతం ప్రతిపాది కంగా రిజర్వేషన్లు ఖరారు చేయగా జిల్లాలోని 335 గ్రామపంచాయతీలలో 198 ఎస్టీలకు, 32 ఎస్సీలకు, 67 బీసీలకు, 38 జనరల్ స్థానాలకు రిజర్వేషన్లను కేటాయించారు. అలాగే 2,874 వార్డు స్థానాలకు గా ను 1,292 ఎస్టీలకు, 226 ఎస్సీలకు, 534 బీసీలకు, 822 జనరల్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారయ్యాయి.
- అభ్యర్థుల ఎంపికకు..
అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలు పెట్టారు. ఇటీవల ఖరారైన రిజర్వేషన్ల ఆధారంగా ఏ స్థానంలో ఎవరిని నిలబెడితే గెలిచే అవకాశం ఉంటుందన్న పార్టీ ప్రతినిధులు పరిశీలించే పనిలో పడ్డారు. డబ్బులు, పలుకుబడి, కులం, గుణగణా లు, రిజర్వేషన్లు కలసి వచ్చే వారికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. గెలుపు కోసం ప్రధా నమైన కొన్ని ఆంశాలపై అంతర్గతంగా అభ్యర్థుల ఎంపిక కోసం దృష్టి సారిస్తున్నారు. ఆశావా హులు ఒకవైపు టికెట్ వేట కొనసాగిస్తూనే మరో వైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలక రింపులు మొదలుపెట్టారు. అయితే ముందు నుంచి పోటి చేస్తామని ఓటర్ల మధ్యనే ఉన్న పలువురికి రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశలోకి వెళ్లారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే అధికార పార్టీ నుంచి పోటి చేస్తేనే ఎమ్మెల్యే మద్దతు ఉంటుందని, ఆర్థికంగా సహకారం ఉంటుందని భావిస్తున్నారు.
- తగ్గిన బీసీ స్థానాలు..
గతంలో కంటే బీసీ స్థానాలు తగ్గాయి. గత ఎన్నికల్లో బీసీలకు 33 స్థానాలు కేటాయిస్తే ఈసారి ఆ సంఖ్య 20కి తగ్గింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సామాజిక వర్గం ఆందోళనలు చేస్తుంటే ఈసారి వారి స్థానాలు మరిన్ని తగ్గడంతో ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం తొలగించడంతో పోటీదారుల సంఖ్య పెరుగుతోంది. గతంలో తాము పోటీ చేసేందుకు అవకాశం లేని కారణంగా అనుచరులు, స్నేహితులకు మద్దతు తెలిపిన వీరు ప్రస్తుతం తామే బరిలో ఉంటామని చెబుతున్నారు. దీంతో గెలుపోటముల సమీకర ణాలు సైతం మారుతున్నాయని చెబుతున్నారు.
నామినేషన్ల షెడ్యూల్ ఇలా..
మొదటి దశలో..
నవంబరు 27 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ30న పరిశీలన, అర్హుల జాబితాడిసెంబరు 1న అప్పీల్, 2న డిస్‌పోషల్, 3న విత్ డ్రా, తుది జాబితా
11న పోలింగ్, కౌంటింగ్
రెండో దశలో..
నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు నామి నేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, అర్హుల జాబితా, 4న అప్పీల్, 5న డిస్‌పోషల్, 6న విత్ డ్రా, తుది జాబితా, 14న పోలింగ్, కౌంటింగ్
మూడో దశలో ..
డిసెంబరు 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6న స్కూృటిని, అర్హుల జాబితా, 7న అప్పీల్, 8న డిస్‌పోషల్, 9న విత్ డ్రా, అర్హుల జాబితా, 17 పోలింగ్