బుద్ధవనాన్ని సందర్శించిన థాయ్‌లాండ్ బౌద్ధ భిక్షువులు
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:29 AM
నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని థాయ్‌లాండ్ దేశపు బౌద్ధ భిక్షువులు, అంతర్జాతీయ నటుడు, సిద్దార్థ గౌతమ పాత్రదారి గగన్‌మాలిక్ ఆధ్వర్యంలో ఆదివారం సందర్శించారు.
నాగార్జునసాగర్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని థాయ్‌లాండ్ దేశపు బౌద్ధ భిక్షువులు, అంతర్జాతీయ నటుడు, సిద్దార్థ గౌతమ పాత్రదారి గగన్‌మాలిక్ ఆధ్వర్యంలో ఆదివారం సందర్శించారు. నాగార్జునసాగర్‌లో తెలంగాణ టూరిజం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం మహాస్థూపంలో 2022 నవంబరు 29న బుద్ధుని ధాతవులను ఇండోనేషియా దేశం నుంచి తీసుకొచ్చి బహూకరించిన మహాభాగ్యం గగన్‌మాలిక్‌కే దక్కుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు గుల్బర్గాను ఆదివారం సందర్శించిన అనంతరం వారితో పాటు కలిసి నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధపాదాలు వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధ చరిత వనం, జాతకవనం, ధాన్యవనం, స్థూపవనాలను సందర్శించి మహాస్తంభంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. వీరితోపాటు బుద్ధవనం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శాసన, బుద్ధవనం మేనేజర్(ఆర్ట్ మరియు ప్రమోషన్స్), స్థపతి శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.