High Court Order: గ్రూప్-1పై అప్పీలుకెళ్దామా?
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:45 AM
గ్రూప్-1 పరీక్షలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో.. పరీక్షల విషయం మళ్లీ మొదటికొచ్చింది. ...
ఆలోచనలో టీజీపీఎస్సీ యంత్రాంగం
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్షలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో.. పరీక్షల విషయం మళ్లీ మొదటికొచ్చింది. సమాధానపత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని.. లేనిపక్షంలో పరీక్షలను రద్దుచేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించడంతోపాటు.. టీజీపీఎస్సీ పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై మంగళవారం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, అభ్యర్థుల అన్ని అనుమానాలను నివృత్తి చేశామని కమిషన్ చెబుతోంది. కొందరు రాజకీయ దురుద్దేశంతో దీన్ని వివాదాస్పదం చేస్తున్నారని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో డివిజన్ బెంచ్‌కి అప్పీలు చేయాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయి. డివిజన్ బెంచ్‌లో తన వాదనను మరింత సమర్ధంగా వినిపించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తిచేసుకుని, నియామక పత్రాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు సైతం హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని నిర్ణయించారు. వారు కూడా డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అక్కడా న్యాయం జరగకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.