PM ABHIM Fund: ఆ వివరాలను త్వరలోనే అందజేస్తాం
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:47 AM
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభిమ్) కింద విడుదలైన నిధుల వినియోగంపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కోరిన వివరాలను వీలైనంత..
పీఎం-అభిమ్ నిధుల వ్యయ లెక్కలు అందుబాటులో లేవన్నది సరికాదు
కమిషనర్‌కు వివరాలు అందిస్తాం
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై టీజీఎంఎ్‌సఐడీసీ వివరణ
డేటా ఉంటే కమిషనర్‌కు ఎందుకు పంపలేదు?
చెల్లింపులో కమీషన్లు వాస్తవం కాదా?
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభిమ్) కింద విడుదలైన నిధుల వినియోగంపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కోరిన వివరాలను వీలైనంత త్వరలోనే అందజేస్తామని వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ) వెల్లడించింది. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై టీజీఎంఎ్‌సఐడీసీ అధికారులు వివరణ ఇచ్చారు. డేటా అందుబాటులో లేదనే ఆరోపణలు నిరాధారమైవని తెలిపారు. నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలు ఇచ్చిన తర్వాతే తదుపరి నిధులను కేంద్రం విడుదల చేస్తుందని పేర్కొన్నారు. నిధుల వ్యయ వివరాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అధికారులు తెలిపారు. అయితే, ఒక్క పీఎం-అభిమ్ నిధులేకాక, ఎన్‌హెచ్‌ఎం కింద టీజీఎంఎ్‌సఐడీసీకి విడుదల చేసిన నిధులు వేటికి ఖర్చుపెట్టారో వివరాలివ్వాలని కమిషనర్ తన లేఖలో కోరినట్లు ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో పేర్కొంది. పీఎం-అభిమ్ కింద విడుదల చేసిన నిధులను ఏయే పనులకు వినియోగించారో తెలపాలంటూ వారం క్రితం కమిషనర్.. టీజీఎంఎ్‌సఐడీసీకి లేఖ రాసిన విషయం వాస్తవం కాదా? వివరాలుంటే వెంటనే ఎందుకు పంపలేదు? కార్పొరేషన్ వద్ద లెక్కలుంటే.. తమ వివరణలో ఏ కాంపొనెంట్‌కు ఎంత ఖర్చుపెట్టారో ఎందుకు వెల్లడించలేదు? పీఎం-అభిమ్ నిధులతో క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మించిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం టీజీఎంఎ్‌సఐడీసీ, కమిషనర్ కార్యాలయానికి క్యూ కడుతున్న మాట వాస్తవం కాదా? బిల్లులు పెట్టేందుకు కార్పొరేషన్ అధికారులు కమీషన్ డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్లుఫిర్యాదు చేసింది వాస్తవం కాదా? కమీషన్ల పర్వంపై విజిలెన్స్ విచారణ జరిపితే విషయం వెలుగులోకి వస్తుందని కార్పొరేషన్ సిబ్బంది కోరుతున్నది వాస్తవం కాదా? ఈ ప్రశ్నలకు టీజీఎంఎ్‌సఐడీసీయే బదులివ్వాల్సి ఉంది.