Share News

Appeal to Reclaim IDPL Lands: ఐడీపీఎల్‌ భూములపై హైకోర్టులో అప్పీల్‌!

ABN , Publish Date - Dec 17 , 2025 | 06:11 AM

ఐడీపీఎల్‌కు అప్పగించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాలని టీజీఐఐసీ భావిస్తోంది. గతంలో బోర్డు ఫర్‌ ఇండస్ర్టియల్‌....

Appeal to Reclaim IDPL Lands: ఐడీపీఎల్‌ భూములపై హైకోర్టులో అప్పీల్‌!

  • కోర్టును ఆశ్రయించేందుకు టీజీఐఐసీ సన్నాహాలు

  • భూముల స్వాధీనానికి గతంలో బీఐఎ్‌ఫఆర్‌ బ్రేకులు

  • అప్పీల్‌ చేయాలంటూ రెండు సార్లు లేఖ రాసిన కలెక్టర్లు

  • చిక్కులు అధిగమిస్తే ఐడీపీఎల్‌ భూములన్నీ సర్కారు చేతికి..

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్ర జ్యోతి): ఐడీపీఎల్‌కు అప్పగించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాలని టీజీఐఐసీ భావిస్తోంది. గతంలో బోర్డు ఫర్‌ ఇండస్ర్టియల్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ (బీఐఎ్‌ఫఆర్‌) ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ అప్పీల్‌ దాఖలు చేయాలని యోచిస్తోంది. ఔషధాల తయారీ కోసం ఏర్పాటైన ఐడీపీఎల్‌ పరిశ్రమ.. 2003లో మూతపడిన విషయం తెలిసిందే. దీన్ని షరతుల ఉల్లంఘనగా పరిగణిస్తూ ఐడీపీఎల్‌కు కేటాయించిన 891.38 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని అప్పటి కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఐడీపీఎల్‌ను సిక్‌ ఇండస్ర్టీగా గుర్తించిన బీఐఎ్‌ఫఆర్‌.. భూముల స్వాధీనానికి కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ప్రజాప్రయోజనాల కోసం భూమిని సేకరించి ఐడీపీఎల్‌కు అప్పగించామని రాష్ట్ర ప్రభుత్వం వాదించినా.. స్వాధీనం కోసం బలవంతపు చర్యలకు దిగొద్దని సూచించింది. ఈ ఆదేశాలపై అప్పీల్‌ దాఖలు చేసుకోవాలని భారత సొలిసిటర్‌ జనరల్‌ సూచించినప్పటికీ.. 9 ఏళ్ల వరకు అప్పీల్‌ దాఖలు చేయలేదు. 2016లో బీఐఎ్‌ఫఆర్‌ రద్దు కావడంతో ఈ కేసు సైతం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌( ఎన్‌సీఎల్‌టీ)కు బదిలీ అయింది. ఎన్‌పీఎల్‌టీతో సంప్రదింపుల తర్వాత కేసు పూర్వపరాలను పరిగణనలోకి తీసుకుని అప్పీల్‌కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ సైతం అప్పట్లోనే సూచించారు. బీఐఎ్‌ఫఆర్‌ ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లాలని 2017 మే 8న ఒక సారి, 2024 డిసెంబరు 3న మరో సారి టీజీఐఐసీ ఎండీకి అప్పటి మేడ్చల్‌ కలెక్టర్లు లేఖలు రాశారు. విలువైన భూముల పరిరక్షణ కోసం తక్షణమే సీనియర్‌ న్యాయవాదుల సలహాలు తీసుకొని, కోర్టును ఆశ్రయించాలని కోరారు. కానీ, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగలేదు. తాజాగా ఈ వివాదం మరో సారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఐడీపీఎల్‌ భూములను స్వాధీనం చేసుకుంటామంటూ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేయాలని టీజీఐఐసీ భావిస్తోంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తే వేల కోట్ల రూపాయల విలువైన ఐడీపీఎల్‌ భూములు.. మళ్లీ సర్కారు చేతికి రానున్నాయి.

Updated Date - Dec 17 , 2025 | 06:11 AM