TG State Government: కోర్టు కేసుల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థ
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:41 AM
కోర్టు కేసుల పర్యవేక్షణకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించిన కోర్టు కేస్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్)ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రెవెన్యూ, హోం, విద్యాశాఖల్లో అమలుకు ప్రతిపాదన
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కోర్టు కేసుల పర్యవేక్షణకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించిన కోర్టు కేస్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్)ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని రెవెన్యూ, హోం, విద్యా శాఖల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసులను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక డ్యాష్ బోర్డును అందుబాటులోకి తీసుకురానుంది. పెండింగ్ కేసుల పర్యవేక్షణ, యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ద్వారా కేసులను నిరంతరం సమీక్షించేందుకు ఈ విధానం దోహదపడతుందని ప్రభుత్వం భావిస్తోంది. బిహార్‌లో ఈ విధానం ఇప్పటికే విజయవంతం కావడంతో ఇక్కడా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ శాఖలకు సంబంధించి కోర్టు కేసులు సుమారు 40 వేల వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా రెవెన్యూ, విద్య, హోం, వైద్యం, పరిశ్రమల శాఖలకు సంబంధించినవే ఉంటున్నాయి. రోజువారీ పని ఒత్తిడి వల్ల సకాలంలో ఆయా శాఖల తరుపున స్పందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్ది ఇక నుంచి ప్రతి కేసును సమీక్షించేలా సీసీఎంఎ్‌సను అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా కేసుల విచారణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆయా శాఖాధిపతులకు హెచ్చరికల రూపంలో అందుతాయి. తద్వారా కౌంటర్ అఫిడవిట్‌ల దాఖలకు, సమ్మతి గడువులను తెలుసుకునే వీలు కలుగుతుంది. వ్యక్తిగత కేసుల పురోగతిని ట్రాక్ చేయడానికి కార్యదర్శులు, న్యాయ శాఖ అధికారులకు డ్యాష్ బోర్డును అందుబాటులోకి తెస్తారు. సీసీఎంఎస్‌తో అన్ని విభాగాలను అనుసంధానం చేస్తారు. అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ ప్లీడర్ల కార్యాలయాలతోనూ, హైకోర్టు సమాచార వ్యవస్థతోనూ సీసీఎంఎస్‌ను అనుసంధానిస్తారు. దీనికి ఐటీ విభాగం సహాయ సహకారాలను అందించనుంది. న్యాయ, రెవెన్యూ, హోం శాఖ కార్యదర్శుల నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.