TET Pressure on Teachers: ట్యూషన్‌కు టీచర్లు!
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:35 AM
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ టెన్షన్ నెలకొంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు వారంతా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. కొందరు బడిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే..
ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్.. పుస్తకాలతో కుస్తీ
సెలవులు పెట్టి ఆన్‌లైన్ కోచింగ్
2012కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి.. అర్హత సాధించకపోతే ఉద్యోగం ఊస్ట్
సెప్టెంబరులో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
3వ తేదీ నుంచి 20 వరకు 19 జిల్లాల్లో పరీక్ష
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (టెట్) టెన్షన్ నెలకొంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు వారంతా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. కొందరు బడిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. లీజర్, భోజన విరామ సమయాల్లో చదువుకొంటున్నారు. కొందరేమో సెలవులు పెట్టి ఇంటివద్ద ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుంటున్నారు. జాతీయ విద్యా విధానం ప్రకారం డీఎస్సీ పరీక్ష రాస్తున్న అభ్యర్థులతోపాటు దేశవ్యాప్తంగా 2012లోపు నియమితులైన టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇందుకు రెండేళ్ల వెసులుబాటు ఇచ్చింది. అర్హత సాధించకపోతే గనక ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన నుంచి ఉద్యోగ విరమణకు ఐదేళ్ల కన్నా తక్కువ సర్వీసు ఉన్నవారికి మినహాయింపునిచ్చింది. ఈ తీర్పుతో ఇన్‌సర్వీ్‌స టీచర్లలో ఆందోళన నెలకొంది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), తెలుగు, హిందీ భాషా పండిత కోర్సులు పూర్తి చేసి డీఎస్సీలో ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తమకు టెట్ నిబంధన పెట్టడం ఏమిటి? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పును అందరూ పాటించాల్సి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2,444 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 15,072 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 60 శాతం మంది 20-25 ఏళ్ల క్రితం టీచర్ ఉద్యోగాల్లో చేరిన వారున్నారు. వీరిలో ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్నవారు 25 శాతం మంది ఉండగా.. మిగతా 35 ు 55 ఏళ్లలోపు వారున్నారు.
పిల్లలు, బంధువులతో సందేహాల నివృత్తి
జనవరి 3 నుంచి 20 వరకు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో టెట్-1, టెట్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షలు జరుగుతుండటంతో ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఇన్‌సర్వీ్‌స టీచర్లలో చాలామంది 20 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరినవారున్నారు. ఇందులో ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొంది పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. వీరంతా టెట్-2 అర్హత సాధించాల్సి ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఫిజిక్స్‌తోపాటు గణితాన్ని చదవాల్సి ఉంది. బయాలాజికల్ టీచర్ గణితంలో కూడా పట్టు సాధించాల్సి ఉంటుంది. దీంతో ఆయా సబ్జెక్టు టీచర్లు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. గణితంలోని సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కొంతమంది పిల్లలు, బంధువులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. చాలామంది ఆన్‌లైన్ కోచింగ్‌పైనే ఆధారపడి పరీక్షకు సిద్ధమవుతున్నారు.
పరీక్ష వేళ.. బోధన ఎలా?
టెట్ నేపథ్యంలో చాలామంది ఇన్‌సర్వీ్‌స టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్‌ను విడిచి వెళ్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధానంగా ఇద్దరు, ముగ్గురు టీచర్లున్న ప్రాథమిక పాఠశాలల్లో, ఉర్దూ, హిందీ, మరాఠీ లాంటి మైనర్ మీడియం స్కూళ్లలో పనిచేసే టీచర్లు పరీక్షకు హాజరైతే పిల్లలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం చొరవ చూపి టీచర్లకు పరీక్ష ఉండే రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించాలని, లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.