Teacher Eligibility Test: టెట్ అభ్యర్థులకు ప్రయాణ పరీక్ష
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:18 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసే అభ్యర్థులు ఈసారి భారీ ప్రయాణ కష్టాలను ఎదుర్కోబోతున్నారు.
300 కి.మీ దూరంలో కేంద్రాలు
జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు
ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసే అభ్యర్థులు ఈసారి భారీ ప్రయాణ కష్టాలను ఎదుర్కోబోతున్నారు. జనవరి 3 నుంచి 20 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 2,37,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా, రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటివరకు అర్హత సాధించని సుమారు 71,670 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈసారి రంగంలోకి దిగారు. దరఖాస్తుల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగినప్పటికీ, అందుకు తగినట్టుగా అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం అభ్యర్థులకు శాపంగా మారింది. పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహిస్తుండడంతో, సాంకేతిక సౌకర్యాలున్న 19 జిల్లాల్లో మాత్రమే 97 కేంద్రాలను ఏర్పాటుచేశారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమకు నచ్చిన జిల్లాలను ఎంచుకున్నప్పటికీ, 300కిలోమీటర్ల దూరంలో కేంద్రాలను కేటాయించారు. ఉదాహరణకు కొత్తగూడెం వాసులకు హైదరాబాద్‌లో, నిర్మల్ జిల్లా వారికి ఖమ్మంలో కేంద్రాలు కేటాయించడం గమనార్హం. పరీక్షలు ఉదయం 9గంటలకే ప్రారంభం కానుండడంతో, అభ్యర్థులు ముందురోజు రాత్రే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో,సుదూర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాస్తున్న ఇన్-సర్వీసె్‌సఉపాధ్యాయులకు ‘ఆన్‌డ్యూటీ’ సౌకర్యం కల్పించాలనిటీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి విజ్ఞప్తి చేశారు. శనివారం నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి రావడంతో అభ్యర్థులు తమ కేంద్రాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.