Internal Investigation: టీశాక్ కలెక్షన్ కింగ్‌పై విచారణ
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:40 AM
ఎయిడ్స్ రోగులకు సేవలందించే ఎన్‌జీవోల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లు వసూలు చేసిన తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ(టీశాక్) కలెక్షన్ కింగ్‌పై సర్కారు ఆరా తీసింది.
వైద్యారోగ్య శాఖలో ‘ఆంధ్రజ్యోతి’ కథనం కలకలం
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఎయిడ్స్ రోగులకు సేవలందించే ఎన్‌జీవోల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లు వసూలు చేసిన తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ(టీశాక్) కలెక్షన్ కింగ్‌పై సర్కారు ఆరా తీసింది. ‘టీశాక్‌లో కలెక్షన్ కింగ్’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనం వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కథనంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కూడా ఆరా తీశారు. తదుపరి చర్యలపై ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్థు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. నేడో, రేపో విచారణాఽధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కలెక్షన్ కింగ్ కథనంపై టీశాక్ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. నిధులు దుర్వినియోగం కాలేదని, అంతర్గత సర్దుబాటులో భాగంగానే బదిలీలు చేశామని వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తులు ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల నుంచి నిధుల వసూల్ చేయడానికి అవకాశమే లేదని స్పష్టం చేశారు. అయితే, టీశాక్ పీడీ తన వివరణలో ఎన్‌జీవోల నుంచి బలవంతంగా డబ్బులు వసూళ్లు అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకపోగా, దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. కాగా, ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ఎన్‌జీవోలు, టీశాక్ కార్యాలయ వర్గాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం వందశాతం నిజమని, ఇప్పటికే రూ.3 కోట్ల నుంచి 3.5 కోట్ల దాకా ఎన్‌జీవోల నుంచి వసూళ్లు చేశారని ఆ వర్గాలు వెల్లడించాయి.