Share News

Minister Jupalli Krishna Rao Accused: ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 06:04 AM

రాష్ట్ర ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతోంది. కీలకమైన ఎక్సైజ్‌ శాఖలో మంత్రి, ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా నివురుగప్పిన..

Minister Jupalli Krishna Rao Accused: ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు

  • నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కమిషనర్‌ హరికిరణ్‌ పెడచెవిన పెట్టారు

  • విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు

  • అనవసరంగా సీఎంవోకు ఫైళ్లు పంపారు

  • నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు

  • రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు

  • సీఎ్‌సకు మంత్రి జూపల్లి ఫిర్యాదు

  • స్వచ్ఛంద పదవీ విరమణకు రిజ్వీ దరఖాస్తు

  • ఆమోదించవద్దని సీఎ్‌సకు మంత్రి లేఖ

  • మంత్రిగా తన విధులు నిర్వహించకుండా రిజ్వీ ఆటంకం కలిగించారని ఆరోపణ

  • ఆయనపై ఏఐఎస్‌ సర్వీస్‌ రూల్స్‌, బీఎన్‌ఎ్‌స ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ఆబ్కారీ శాఖలో ‘అనుచిత ప్రవర్తన’ అంశం మంటలు రేపుతోంది. కీలకమైన ఎక్సైజ్‌ శాఖలో మంత్రి, ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తాను ఇచ్చిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ, కమిషనర్‌ హరికిరణ్‌ పెడచెవిన పెట్టారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం, దీనితో రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ వీఆర్‌ఎ్‌సను ఆమోదించవద్దంటూ సీఎ్‌సకు మంత్రి మరో లేఖ రాయడం.. పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం వంటి వరుస పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

రిజ్వీపై చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి

రిజ్వీ వీఆర్‌ఎస్‌ దరఖాస్తు, ఆయనపై సీఎ్‌సకు మంత్రి చేసిన ఫిర్యాదు బయటికి వచ్చిన అనంతరం.. సీఎ్‌సకు మంత్రి జూపల్లి మరో లేఖ రాశారు. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యంగ బద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


సీఎ్‌సకు పంపిన నోట్‌లోని వివరాలివీ..

‘‘మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్‌ లేబుల్స్‌కు సంబంధించి 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్టు ఇస్తున్నారు. కొత్త సాంకేతితలతో, మరింత భద్రమైన లేబుల్స్‌ ఇచ్చేలా కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించినా.. ముఖ్య కార్యదర్శి రిజ్వీ పాతవారికే అవకాశం కల్పించారు. చిట్టీ స్రుజన్‌ కేసులో బకాయిలు, కాంపౌండింగ్‌ ఫీజును పునః పరిశీలించాలని మంత్రి మూడు పర్యాయాలు ఆదేశించినా ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదు. క్యాప్రికార్న్‌ బ్లెండర్స్‌ నుంచి చట్టవిరుద్ధంగా రూ.6.15 కోట్ల డిమరేజ్‌ చార్జీలను వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో.. సంబంధిత రికార్డులు అందజేయాలని మంత్రి కోరినా.. నివేదికల పేరుతో ముఖ్యకార్యదర్శి జాప్యం చేశారు. టీజీబీసీఎల్‌ ఎండీకి అవసరమైన వివరాలు ఇవ్వలేదు. ఏబీడీ లిమిటెడ్‌ కంపెనీ మద్యం ఉత్పత్తి, గరిష్ఠ అమ్మకం ధర విషయంలో అసాధారణ జాప్యంతో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం కలిగిందనే ఫిర్యాదులపై ఎక్సైజ్‌ కమిషనర్‌ను మంత్రి వివరణ కోరినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక అవసరం లేని ఫైళ్లను కూడా సీఎంవో కార్యాలయానికి పంపడం, మంత్రి తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం కావాలంటూ కోరడం వంటి చర్యలతో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. ఎంపీ (ఈఎంపీఈఈ) డిస్టలరీ విషయంలో ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) జారీ చేయాలని మంత్రి ఆదేశించినా ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదు. బ్లూసీల్‌ వైనరీ విషయంలో మేనేజ్‌మెంట్‌ మార్పు ప్రక్రియ ఎన్నికల కోడ్‌ కారణంగా 5 నెలల 21 రోజులు జాప్యం జరిగింది. లైసెన్స్‌ పొందడంలో మేనేజ్‌మెంట్‌ తప్పు లేదని, అనుమతులు ఇవ్వాలని మంత్రి ఆదేశించగా.. మంత్రికి నిబంధనలు సడలించే అధికారం లేదని, ముఖ్యమంత్రికి మాత్రమే ఉందంటూ రిజ్వీ ఆ ఫైల్‌ను సీఎంవోకు పంపారు. ఏ నిబంధన కింద సీఎంకు ఈ ఫైల్‌ పంపారో తెలపాలని ముఖ్య కార్యదర్శిని మంత్రి అడగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలా సంబంధం లేని ఫైళ్లు పంపడం ద్వారా.. సీఎంవోపై అనవసరపు భారం మోపారు. డిస్టిలరీలకు సంబంధించి ఎల్‌ఓఐలను ఆమోదించే అధికారం మంత్రికే ఉన్నా.. మంత్రి మండలి ఆమోదం కావాలంటూ పెండింగ్‌లో పెట్టారు. ఇక బార్‌ అసోసియేషన్‌ ఫిర్యాదులు, ఏ4 దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా ఆయా అంశాల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఈ ఏడాది ఆగస్టు 30న కమిషనర్‌ను మంత్రి కోరినా ఇంత వరకు నివేదిక ఇవ్వలేదు. కొన్ని లిక్కర్‌ సంస్థలకు సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి రాష్ట్ర ఖజానాకు రూ.223 కోట్ల నష్టం వాటిల్లేలా కమిషనర్‌ వ్యవహరించారు’’ అని నోట్‌లో పేర్కొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 06:04 AM