Share News

Minister Dispute: కొండా x పొంగులేటి!

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:54 AM

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి....

Minister Dispute: కొండా x పొంగులేటి!

  • దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం!

  • అధిష్ఠానానికి కొండా దంపతుల ఫిర్యాదు?

  • ఎవరిపైనా మేం ఫిర్యాదు చేయలేదు: మురళి

హైదరాబాద్‌/వరంగల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తాను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారంటూ కొండా సురేఖ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా.. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో ఇది మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రూ.71 కోట్లతో చేపట్టిన పనుల టెండర్‌లను తన మనుషులకు ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొండా సురేఖ సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరోవైపు మంత్రి సురేఖ భర్త కొండా మురళి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ పరిణామం అధికార కాంగ్రె్‌సలో చర్చనీయాంశంగా మారింది. అయితే జాతర పనులపై తాము ఎవరిపైనా, ఎవరికీ ఫిర్యాదు చేయలేదని కొండా మురళి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఏ మంత్రితోనూ తమకు విభేదాలు లేవన్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 03:54 AM