Share News

High Tension Erupted in Manuguru: బీఆర్‌ఎస్‌ X కాంగ్రెస్‌

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:26 AM

తమ పార్టీ కార్యాలయాన్ని గతంలో బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ప్రస్తుత బీఆర్‌ఎస్‌....

High Tension Erupted in Manuguru: బీఆర్‌ఎస్‌ X కాంగ్రెస్‌

  • మణుగూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి.. ఫర్నిచర్‌ ధ్వంసం

  • గతంలో అది తమ ఆఫీసేనని.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆక్రమించారని ఆరోపణ

  • ‘ఇందిరమ్మ భవనం’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు

  • పట్టణంలో పోలీసుల మోహరింపు

  • ముమ్మాటికి అది కాంగ్రెస్‌ కార్యాలయమే: స్థల దాత వారసుడు హరిబాబు

మణుగూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ కార్యాలయాన్ని గతంలో బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ప్రస్తుత బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుపై దాడి చేసి ఫర్నిచర్‌, ఇతర వస్తువులను తగులబెట్టాయి. భవనంపై ఉన్న గులాబీ రంగును, బీఆర్‌ఎస్‌ జెండాను తొలగించి కాంగ్రెస్‌ జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ఉదయాన్నే వందలాది సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా బీఆర్‌ఎస్‌ ఆఫీసుకు వెళ్లారు. అనంతరం లోపలికి ప్రవేశించి.. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను విరగ్గొట్టారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలను బయటికి తోసేసి ఫర్నిచర్‌ను బయట పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. జై కాంగ్రెస్‌.. జై జై కాంగ్రెస్‌.. ఎమ్మెల్యే పాయం నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ బిగ్గరగా నినాదాలు చేసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎ్‌సకు చెందిన ఒకరిద్దరు కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించి.. కార్యాలయం నుంచి బయటకు గెంటేశారు. ఈ దాడిలో ఓ బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు గాయమైంది. ఆగ్రహావేశాలతో ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు కార్యాలయ భవనం పైకి ఎక్కి బీఆర్‌ఎస్‌ జెండాలను పీకేసి.. కాంగ్రెస్‌ జెండాలను ఏర్పాటు చేశారు. మణుగూరు డీఎస్పీ రవీంద్రరెడ్డి, సీఐ నాగబాబు, ఎస్సై శ్రావణ్‌ కుమార్‌ ఘటనా స్థలికి చేరుకొని పరిస్ధితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే వందల సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు చేరుకోవడంతో.. పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నాయకులు.. భవనంపై ఉన్న గులాబీ రంగు పెయింట్లను తొలగించి, ఇందిరమ్మ భవనం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అనంతరం కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. ఫర్నిచర్‌ దహనంతో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు రావడంతో.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తమ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని బీఆర్‌ఎస్‌ భవనంగా మార్చారని, ఏడేళ్ల నుంచి నిరీక్షించిన తమకు ఈ రోజుతో కార్యాలయాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు మరోమారు కార్యాలయంలోకి ప్రవేశించే యత్నం చేయ గా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఎస్పీ వెంటనే మణుగూరుకు స్పెషల్‌ పార్టీ బలగాలను పంపించి, బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా మణుగూరులో 144 సెక్షన్‌ విధించారు.


బీఆర్‌ఎస్‌ నాయకుల ఆందోళన

తమ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడిన కాంగ్రెస్‌ నాయకులను వెంటనే ఇక్కడి నుంచి వెనక్కి పంపించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మణుగూరులోని ప్రధాన రోడ్డుపై ఆందోళన చేశారు. వారికి సర్దిచెప్పేందుకు మణుగూరు సీఐ నాగబాబు, ఇతర పోలీసు అధికారులు ఎంత ప్రయత్నించినా.. ఫలితం కనిపించలేదు. కాంగ్రెస్‌ నేతలను పంపితేనే తాము వెళ్తామంటూ.. బీఆర్‌ఎస్‌ నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య కొంత దూరాన్ని ఏర్పాటు చేసి స్పెషల్‌పార్టీ బలగాలు.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూశాయి.

ఎంతో సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే పాయం

తమ శ్రమతో పైసా పైసా కూడబెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాంగ్రెస్‌ కార్యాలయంగా ఇందిరమ్మ భవనాన్ని నిర్మించుకుంటే దాన్ని కబ్జా చేసి తెలంగాణ భవన్‌గా మార్చారని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తిరిగి తమ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. వారి శ్రమకు ప్రతిఫలం దక్కిందని, తమకు ఇది ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

దాడులు, బెదిరింపులకు మేము భయపడబోం: మాజీ ఎమ్మెల్యే రేగా

కాంగ్రె్‌సకు జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, రాష్ట్రంలో ఇలాంటి గొడవలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి దాడులకు, బెదిరింపులకు తాను భయపడబోమన్నారు. గత ఎన్నికల ప్రచారంలో నేటి సీఎం రేవంత్‌ రెడ్డి.. తనను గుడ్డలూడదీసి తన్నిస్తానని హెచ్చరికలు చేశారని, అందుకే ఇలా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. భవనానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల కోసం అవసరమైతే కొత్త భవనాన్ని నిర్మించి ఇస్తానని తెలిపారు.


ముమ్మాటికీ కాంగ్రెస్‌ కార్యాలయమే

మణుగూరులోని ప్రధాన ర హదారి పక్కన ఉన్న పార్టీ కార్యాలయం ముమ్మటికీ కాంగ్రెస్‌ పార్టీదేనని స్ధల దాత వారసుడు పీకేఎస్‌ హరిబాబు అన్నారు. 1980లో తన తండ్రి పిళ్ళారిశెట్టి సత్యనారాయణ వద్దకు నాటి ఎమ్మెల్యే చందాలింగయ్య, మండల కాంగ్రెస్‌ నాయకులు బత్తుల వీరయ్య, పోలమూరి రాజు వచ్చి కాంగ్రెస్‌ కార్యాలయం కోసం స్థలం అడిగారని తెలిపారు. కాంగ్రె్‌సపై అభిమానంతో తన తండ్రి ఈ స్థలాన్ని కేటాయించగా.. అక్కడ భననాన్ని నిర్మించి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తర్వాత నాయకులు పార్టీలు మారారని, ఆ తర్వాత కార్యాలయాన్ని మార్చారని చెప్పారు.

నేపథ్యం ఇదీ..

కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై తొలిసారి 2009, ఆ తర్వాత 2018 చివర్లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పినపాక ఎమ్మెల్యేగా రేగాకాంతారావు గెలిచారు. అనంతరం 2019లో ప్రజా అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎ్‌స)లో చేరుతున్నట్లు ప్రకటించి పార్టీ మారారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంగా ఉన్న ఈ భవనాన్ని ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంగా రేగా కాంతారావు మార్చారు. దీంతో అప్పుడే ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో ఖండించిన నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు. పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో నిరాహార దీక్షలను కూడా చేపట్టారు. ఈ విషయంపై జరిగిన ఆందోళనలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ బలరామ్‌, తదితరులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మణుగూరు మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్‌ పార్టీకే చెందాలని చెప్పి వెళ్లారు.

Updated Date - Nov 03 , 2025 | 03:26 AM