Share News

Police Lathi Charge in Jagitial: లెక్కింపు ఉద్రిక్తం!

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:12 AM

చివరి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాత్రి, బుధవారం పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

Police Lathi Charge in Jagitial: లెక్కింపు ఉద్రిక్తం!

  • జగిత్యాల జిల్లా పైడిపల్లిలో లాఠీచార్జి

  • రాళ్లు రువ్విన ఆందోళనకారులు

వెల్గటూరు/న్యూస్‌ నెట్‌వర్క్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : చివరి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాత్రి, బుధవారం పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మద్దతుదారుల మధ్య గొడవలు జరిగాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు గంగుల మంగ 32 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించగా.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ మద్దతుదారు జక్కుల మమత రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేశారు. ఓట్ల తేడా ఎక్కువగానే ఉందంటూ అధికారులు రీకౌంటింగ్‌కు అంగీకరించలేదు. దీనితో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మమత, ఆమె అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారులు, బ్యాలెట్‌ బాక్సులు బయటికి వెళ్లకుండా.. పోలింగ్‌ కేంద్రం ఎదుట రెండు గంటలకుపైగా బైఠాయించారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్నవారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట, ఘర్షణ మొదలయ్యాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా, ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఒక పోలీసు అధికారి తలకు, పలువురు గ్రామస్తులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం మాదారంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాలు దాడులకు దిగాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ మద్దతుదారు వెంకటయ్య అనుచరుడు సాయి, మరో వ్యక్తి, బీఆర్‌ఎస్‌ మద్దతున్న అభ్యర్థి బోయిని రాములుకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇక సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం అలీకాన్‌పల్లిలో మంగళవారం రాత్రి బీఆర్‌ఎస్‌ నేత గుర్రపు మశ్చేందర్‌ కారు అద్దాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. నారాయణఖేడ్‌ మండలం జూక్కల్‌ శివారులో ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. రెండు కార్ల అద్దాలు ధ్వంసం కాగా.. ఇరు వర్గాలకు చెందిన లక్ష్మీబాయి, రాజు, రవినాయక్‌, మారుతీనాయక్‌, లక్ష్మణ్‌రావు, దేవీసింగ్‌లకు గాయాలయ్యాయి.

Updated Date - Dec 18 , 2025 | 03:12 AM