kumaram bheem asifabad- కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:21 PM
జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేసేందుకు టెండర్లు తీసుకుని ఖరారు చేస్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆన్‌లైన్ టెండర్ల స్వీకరణపై అధికారులు, కాంట్రాక్టర్లతో ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు
ఆసిఫాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేసేందుకు టెండర్లు తీసుకుని ఖరారు చేస్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆన్‌లైన్ టెండర్ల స్వీకరణపై అధికారులు, కాంట్రాక్టర్లతో ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహిస్తామని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో అవరమయ్యే 2 కోట్ల 6 లక్షల 33 వేల, 123 గుడ్లను సరఫరా చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా టెండర్లు స్వీకరించనున్నామని చెప్పారు. ఈ నెల 21 తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బిడ్ డాక్యూమెంట్లను డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్‌లో బిడ్‌లను సమర్పిం చాలని తెలిపారు. సమర్పించిన బిడ్‌ల హార్డ్ కాపీలను ఆగస్టు 6వ తేదీన కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఆగస్టు 7న టెక్నికల్ బిడ్‌లు, ఆగస్టు 8న ధరల బిడ్‌లను తెరవనున్నామని తెలిపారు. టెండర్లు సమర్పించే కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం అవసరమయ్యే ధ్రువపత్రాలను టెండర్లతో జతపర్చాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, ఎస్సీ అభివృద్ది అధికారి సజీవన్, విద్యాశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన పాలు సరఫరా చేయాలి
ఆసిఫాబాద్ రూరల్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల విజయ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నుంచి నాణ్యమైన పాలను సరఫరా చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌ను శనివారం సందర్శించారు. యూనిట్‌లో బల్క్ మిల్క్, కూలింగ్ యంత్రాలను, పాలను శుద్ధి చేసే యంత్రాలను పరిశీలించి పాలు సేకరించడం, సరఫరా చేస్తున్న వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ పాడి పరిశ్రమ, సహకార సమాఖ్య విజయ పాల డెయిరీ ఆధ్వర్యంలో జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు పాలు సరఫరా అవుతున్నాయని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా నాణ్యమైన పాలను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అందించే పాలు పూర్తి పోషకాలతో నాణ్యంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో యూనిట్ మేనేజర్ నవీన్, సరఫరాదారులు నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.