Student Welfare: గురుకులాల్లో వస్తువులు, డైట్ టెండర్లకు బ్రేక్!
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:10 AM
రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లలోని లక్షలాది మంది విద్యార్థులకు అవసరమయ్యే వస్తువుల సరఫరా టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది...
జెమ్‌లో చేసుకున్న దరఖాస్తుల నిలిపివేత
ఈ విద్యా సంవత్సరం ట్రంక్ పెట్టెలు, డ్రెస్సులు లేనట్లే!
లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లలోని లక్షలాది మంది విద్యార్థులకు అవసరమయ్యే వస్తువుల సరఫరా టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈ విద్యాసంవత్సరం వారికి ట్రంక్ పెట్టెలు, డ్రెస్సులు, స్కూల్ బ్యాగుల వంటి వ్యక్తిగత వస్తువులు అందించడం కష్టంగా మారింది. మరోవైపు విద్యార్థుల డైట్ (పౌష్టికాహారం) కోసం సరకుల సేకరణ టెండర్ల వ్యవహారం కూడా ఇంకా కోర్టు పరిధిలో ఉండడంతో సందిగ్ధత నెలకొంది. గురుకుల విద్యార్థులకు యూనిఫాంలు, పీటీ డ్రెస్సులు, స్కూల్ బ్యాగులు, ట్రంక్ పెట్టెలు, బెడ్ మెటీరియల్, బూట్ల వంటి వ్యక్తిగత వస్తువుల సరఫరా కోసం కేంద్రీకృత (సెంట్రలైజ్డ్) టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం గత నెలలో ప్రారంభించింది. అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలకు కలిపి ఒకే టెండర్ విధానాన్ని (గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్-జెమ్) తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ టెండర్లు గత నెలలోనే ఖరారై, సరఫరా ఈనెల 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యం జరగడం, ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావడంతో, టెండర్లను పూర్తిగా నిలిపివేశారు. జెమ్‌లో చేసుకున్న దరఖాస్తులు కూడా రద్దయ్యాయి. ఈ నిర్ణయంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు వస్తువుల సరఫరా ఉండకపోవచ్చు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అందించేలా ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు గురుకుల సొసైటీ అధికారి ఒకరు చెప్పారు.
కొత్త టెండర్లు ఖరారయ్యేవరకు పాత కాంట్రాక్టర్లతోనే..
విద్యార్థులకు పౌష్టికాహారం (నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్) అందించేందుకు ఆహ్వానించిన టెండర్లు కూడా నిలిచిపోయాయి. టెండర్ల నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.17ను రద్దు చేయాలని కోరుతూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో టెండర్ల ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయ్యేవరకు పాత కాంట్రాక్టర్లే సరఫరా కొనసాగించాలని అధికారులు ఆదేశించారు. కొత్త డైట్ విధానంలో ధరలు పెంచినా, ఆ పెరిగిన ధర పాత కాంట్రాక్టర్లకు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల సరఫరాదారులు సరఫరా చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగా, వ్యక్తిగత వస్తువుల టెండర్లు రద్దు కావడం, అంత్యంత కీలకమైన డైట్ సరఫరా టెండర్ల వ్యవహారం కోర్టులో ఉండడంతో, ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు
నాణ్యమైన ఆహారం, అవసరమైన
సదుపాయాలు అందించడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. సకాలంలో సదుపాయాలు అందకపోతే పిల్లల చదువులు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.