Irrigation Minister Uttam Kumar Reddy: ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్ కోసం టెండర్లు పిలవండి
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:22 AM
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం టెండర్లు...
అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ప్రాజెక్టు పనుల పునః ప్రారంభంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి 71.5 కి.మీ. మైలారం దాకా గ్రావిటీతో నీటిని తరలించే వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని, అక్కడి నుంచి పంప్‌హౌస్ కట్టి నేరుగా శ్రీపాద ఎల్లంపల్లిలో నీరు వేయొచ్చని, మరో విధానంలో మైలారం నుంచి టన్నెల్ తవ్వి... నేరుగా సుందిళ్లలో గ్రావిటీతో నీటిని వేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు మంత్రికి నివేదించారు. సుందిళ్ల వద్ద పంప్‌హౌస్ సిద్ధంగా ఉన్నందువల్ల శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. అయితే, మైలారం నుంచి సుందిళ్లకు నీటిని తరలించ డానికి అవసరమైన టన్నెల్ కోసం కేంద్ర అటవీ, వాతావరణ పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దాంతో రెండు అలైన్‌మెంట్‌లతో డీపీఆర్ సిద్ధం చేయించాలన్నారు. ఏ అలైన్‌మెంట్‌తో తక్కువ ఖర్చుతో నీటిని తరలించవచ్చో... దాన్నే ఎంచుకోవాలని సూచించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, అంతరాష్ట్ర చీఫ్ ఇంజనీర్ (సీఈ) కె.ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు.