ఆలయ భద్రతకు పెద్దపీట: ఈవో వెంకట్రావు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:43 AM
యాదగిరిగుట్ట ఆలయ భద్రతకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు సూచించారు.
యాదగిరిగుట్ట, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట ఆలయ భద్రతకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు సూచించారు. యాదగిరికొండపై తన కార్యాలయంలో ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొండపైన సీసీ కెమెరాల మానిటరింగ్ సిస్టం పనితీరును పరిశీలించి మరింత మెరుగుపర్చేందుకు ఎస్పీఎఫ్ పోలీసులను ఆదేశించారు. భద్రత కట్టుదిట్ట పర్చేందుకు ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బందిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధునిక పరిజ్ఞానంతో కొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించి అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు పర్యవే క్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దేవస్థాన పరిధిలో వన మహోత్సవం నిర్వహిం చేందుకు ఆలయ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పారు. దేవస్థాన పరిధిలో ప్రణాళికాబద్ధంగా ఐదు ప్రాంతాల్లో మొక్కలను నాటేందుకు గుర్తించాలని సంరక్షించాలని సూచించారు. అందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. వాహన పూజలను కొండకింద రెండో ఘాట్ వద్ద ఖాళీ చేయడానికి సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. సమీక్షలో ఆలయ డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు గజ్వేల్లి రమేష్‌బాబు, జూశెట్టి కృష్ణ, ప్రతాప నవీన్‌కుమార్‌శర్మ, సివిల్ విభాగం ఈఈ జిల్లెల దయాకర్‌రెడ్డి, ఎలక్ట్రికల్ విభాగం ఈఈ ఊడెపు వెంకటరామరావు, పర్యవేక్షకుడు దాసోజు నరేష్, ఎస్ఫీఎఫ్ ఏఎస్‌ఐ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శిల్ప కళాశాల, సంస్కృత విద్యాపీఠంలో కొత్తవారికి సదవకాశం: ఈవో
కొత్తగా ఆలయ నిర్మాణ శిల్ప కళలో ప్రావీణ్యం పొందే కొత్తవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యాదగిరిగుట్ట ఆలయ ఈవో అన్నారు. తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో ఈ నెల 6న జరిగిన బహిరంగ సభలో యాదగిరిగుట్టలో విశ్వవిద్యాలయం స్థాయిలో విద్యా సంస్థ నెలకొల్పుతామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. కొండకింద బస్‌స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలను ఈవో ఆదివారం పర్యవేక్షణ చేసి మాట్లాడారు. వైటీడీఏ ఆధ్వర్యంలో 2019 సంవత్సరంలో సర్టిఫికెట్ కోర్సులతో ప్రారంభించి మూడేళ్ల పాటు బీఏ ప్రవేశపెట్టిన కోర్సులను ప్రిన్సిపాల్ (స్థపతి) మోతీలాల్ వివరించారు. దేవాలయాల నిర్మాణం, వాస్తు, శిల్ప శాస్త్రం, ఆగమశాస్త్రంలో శ్లోకాల రూపంలో బోధించి డ్రాయింగ్ నేర్పించి ప్రాక్టికల్‌గా ఆలయ నిర్మాణం, విగ్రహాల తయారీ విధానంపై తర్ఫీదు ఇస్తామన్నారు. అదేవిధంగా సంస్కృత పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. 1952 సంవత్సరంలో ప్రారంభించిన సంస్కృత పాఠశాల 1954 సంవత్సరంలో ఉస్మా నియా యూనివర్సీటీకి అనుబంధంగా కొనసాగుతూ 2011 సంవత్సరంలో మహాత్మా గాందీ యూనివర్సీటీ (నల్లగొండ) అనుబంధంగా కొనసాగుతోందన్నారు. సంస్కృతంతో పాటు ఆంగ్లం, తెలుగు, చరిత్ర, కంప్యూటర్ కోర్సులు బోదిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 75మంది విద్యార్థులతో కొనసాగుతుండగా ప్రథమ కక్ష్య (6వ, తరగతి) నుంచి ఫ్రీ డిగ్రీ కోర్సులతో పాటు ఉచిత భోజన,, వసతి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కుల, మతాలకు అతీతంగా ఇక్కడి పాఠశాలలో విద్యా బోధన నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈవో వెంట డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో గజ్లేల్లి రఘు ఉన్నారు.