Bone Chilling Cold Grips: వణికిస్తున్న చలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:28 AM
రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో మంగళవారం ఉదయం 7.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది....
కోహీర్‌లో 7.4, సిర్పూర్(యూ)లో 7.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత
హైదరాబాద్ శివార్లు గజ..గజ
రేపటినుంచి మరింత పెరగనున్న తీవ్రత
ఆసిఫాబాద్/కోహీర్/సిరిసిల్ల/హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో మంగళవారం ఉదయం 7.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో పది రోజులుగా జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్(యూ) మండలంలో 7.9 డిగ్రీలు, తిర్యాణి మండలం గిన్నెధరిలో 8.9, కెరమెరిలో 9.7, ఆసిఫాబాద్, వాంకిడి, పెంచికల్‌పేట మండలాల్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో సాయంత్రం ఐదు గంటల నుంచే శీతల గాలులు మొదలవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు చలి తీవ్రత తగ్గక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నార్లాపూర్ 9.8, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేట్ 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక, హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలు చలిగాలులతో గజ..గజ వణికిపోతున్నారు. తెల్లవారుజామున రహదారులను మంచుకప్పేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున శేరిలింగంపల్లిలో 10, మల్కాజిగిరిలో 10.8, అల్వాల్‌లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండురోజులు చలిగాలులు తీవ్రత ఇదే తరహాలో కొనసాగుతుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రుద్రంగి మండలంలో 10.9, బోయినపల్లి, వేములవాడ రూరల్‌లో 11.0, చందుర్తిలో 11.1, తంగళ్లపల్లిలో 11.2, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట, కోనరావుపేటలో 12.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
7జిల్లాలు మినహా..అంతా ఆరెంజ్ అలెర్ట్
రాష్ట్రంలో ఈనెల 18 నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. ఏడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని తెలిపింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్ల్లో ఎముకలు కొరికే చలి ఉంటుందని పేర్కొంది.