Severe Cold Grips Telangana: పంజా విసురుతున్న చలిపులి
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:05 AM
రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్ నగరం సహా అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీ సెల్సియస్ కంటే దిగువకు పడిపోవటంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత మరీ అధికంగా ఉంది....
పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలకంటే దిగువకు ఉష్ణోగత్రలు
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 7 డిగ్రీలు
గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు నమోదు
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి: వాతావరణ కేంద్రం
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ/ ఆసిఫాబాద్/ కోహీర్/ నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్ నగరం సహా అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీ సెల్సియస్ కంటే దిగువకు పడిపోవటంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత మరీ అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో ఆదివారం రాత్రి అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.1 డిగ్రీలు రికార్డయ్యింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, మెదక్, నిర్మల్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఆదివారం రాత్రి 8-10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 12.1 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి తీవ్రత ప్రభావం అధికంగా ఉంది. మరో మూడు రోజులపాటు అన్ని జిల్లాల్లో సగటున 8.6 నుంచి 13.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రమంతటికి యెల్లో అలర్ట్ జారీ చేసింది.
శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు..!
హైదరాబాద్‌లో చలి తీవ్రత వేగంగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారుప్రాంతాల్లో చలి మరీ అధికంగా ఉంది. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.