Dr Srirangacharya with Prestigious Award: శ్రీరంగాచార్యకు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:03 AM
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శ్రీరంగాచార్యను ఈ ఏడాది సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ విశిష్ట పురస్కారం వరించింది....
హైదరాబాద్ సిటీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శ్రీరంగాచార్యను ఈ ఏడాది సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ విశిష్ట పురస్కారం వరించింది. వచ్చే నెల రెండో తేదీన జరిగే వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హనుమంతరావు సోమవారం తెలిపారు. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు. నల్లగొండ జిల్లా చందుపట్లలో జన్మించిన డాక్టర్ శ్రీరంగాచార్య.. 3 దశాబ్దాల పాటు నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ఓరియంటల్ కళాశాల అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న శ్రీరంగాచార్య.. తెలంగాణలో గుర్తింపు నోచుకోకపోయిన 6 తరాల మరింగంటి కవుల కృతులను వెలుగులోకి తెచ్చి.. వాటికి ప్రాణ ప్రతిష్ట చేశారు. చందుపట్లలో రాణిరుద్రమ దేవి కాలం నాటి శాసనాన్ని వెలుగులోకి తెచ్చిన శ్రీరంగాచార్య.. పలువురు నల్లగొండ జిల్లా కవులు, పండితులను సమాజానికి పరిచయం చేశారు.