Krishna river water: కృష్ణా జలాల వినియోగం.. 650.44 టీఎంసీలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:34 AM
కృష్ణాలో 2025-26 వాటర్ ఇయర్‌లో తెలుగు రాష్ట్రాలు 650.44 టీఎంసీల జలాలను వినియోగించుకున్నాయి....
ఏపీ 533, తెలంగాణ 116 టీఎంసీలు
ఈ వాటర్‌ఇయర్‌లో ఏపీకి 82 టీఎంసీలకు మించి ఇవ్వొద్దు
కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
హైదరాబాద్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కృష్ణాలో 2025-26 వాటర్ ఇయర్‌లో తెలుగు రాష్ట్రాలు 650.44 టీఎంసీల జలాలను వినియోగించుకున్నాయి. ఇందులో ఏపీ 533.53 టీఎంసీలు, తెలంగాణ 116.9 టీఎంసీలు తరలించాయి. ఏపీ వినియోగం 82.03 శాతంగా, తెలంగాణ వినియోగం 17.97 శాతంగా ఉంది. ఉమ్మడి జలాశయాలు నాగార్జునసాగర్, శ్రీశైలంలో కనీస నీటిమట్టానికిపైన 299.02 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలంలో 146.8 టీఎంసీలు, సాగర్‌లో 152.21 టీఎంసీలున్నాయి. కృష్ణా జలాలను బచావత్ ట్రైబ్యునల్ గంపగుత్తగా ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం 2015లో ఈ జలాల్లో 66శాతం ఏపీ, తెలంగాణ 34శాతం తాత్కాలికంగా పంచుకున్నాయి. 2024-25 వాటర్ ఇయర్‌లో దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 50:50శాతం నిష్పత్తితో నీటిని పంచాలని కోరుతోంది. నీటి వాటాలను తేల్చే బాధ్యత జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌కు అప్పగించగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో భారీగా వర్షాలు కురియడంతో రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగం అంతంతమాత్రంగానే ఉంది. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ అవసరాలు భారీగా ఉండటంతో ఈ వాటర్ ఇయర్ ముగిసేదాకా 2జలాశయాల్లో కలుపుకొని ఏపీకి 82 టీఎంసీలకు మించి విడుదల చేయరాదని తెలంగాణ కోరింది. ఈ మేరకు కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ(జనరల్) మహ్మద్ అంజద్ హుస్సేన్ లేఖ రాశారు. 2026 జూన్‌లోనే వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 2జలాశయాల్లో నీటి నిల్వలను పరిరక్షించాలని, లేకపోతే రానున్న రోజుల్లో తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బందులు రావచ్చని గుర్తు చేశారు.
శ్రీశైలం నుంచి 218 టీఎంసీలు తరలించిన ఏపీ
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 184 టీఎంసీలను, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 30.11 టీఎంసీలు, చెన్నె తాగునీటి అవసరాలు కలుపుకొని ఏపీ 218.69 టీఎంసీలు తరలించింది. తెలంగాణ శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 15.2 టీఎంసీలను మాత్రమే తరలించింది. నాగార్జునసాగర్ నుంచి జంటనగరాల తాగునీటి అవసరాలకు 8.3 టీఎంసీలు, ఏఎమ్మార్పీ ద్వారా 17.31 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ ద్వారా 38.96 టీఎంసీలు తరలించినట్లు లెక్కలు చెబుతున్నాయి.