Share News

Sandeep Chakravarti Foils Major Terror: పోస్టర్‌ లాగితే ఉగ్రకుట్ర భగ్నం..

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:17 AM

అది శ్రీనగర్‌లోని నౌగామ్‌ ప్రాంతం.. ఈ ఏడాది అక్టోబరులో అక్కడ కొన్నిచోట్ల పోలీసులు, భద్రతా దళాలను హెచ్చరిస్తున్నట్టుగా పోస్టర్లు వెలిశాయి...

Sandeep Chakravarti Foils Major Terror: పోస్టర్‌ లాగితే ఉగ్రకుట్ర భగ్నం..

  • పోస్టర్‌పై రాతల ఆధారంగా దర్యాప్తు

  • సీసీ కెమెరాల జల్లెడ.. హరియాణా, యూపీ పోలీసుల సాయంతో సోదాలు

  • జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నంలో తెలుగు అధికారి చక్రవర్తి కీలకపాత్ర

కర్నూలు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అది శ్రీనగర్‌లోని నౌగామ్‌ ప్రాంతం.. ఈ ఏడాది అక్టోబరులో అక్కడ కొన్నిచోట్ల పోలీసులు, భద్రతా దళాలను హెచ్చరిస్తున్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. అందరూ దీన్నో సాధారణ విషయంగా భావించారు..! కానీ, ఒక పోలీస్‌ అధికారి మాత్రం ఆ పోస్టర్లను నిశితంగా పరిశీలించారు. ఆ రాతల వెనుక ఉద్దేశం ఉగ్రకుట్రకు సంకేతమై ఉండొచ్చని అనుమానించి దర్యాప్తు ప్రారంభించారు. తీగ లాగుకుంటూ వెళితే.. 2,900 కిలోల ఐపీడీ, స్లీపర్‌ సెల్స్‌ లింకులతోపాటు దేశాన్ని విచ్ఛిన్నం చేసే భారీ ఉగ్రకుట్ర బయటపడింది. ఇంతకీ ఆ పోస్టర్‌ వెనుక ఉగ్ర కుట్రను ఛేదించిన అధికారి ఎవరో కాదు. మన తెలుగు తేజం డాక్టర్‌ జీఏ సందీప్‌ చక్రవర్తి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరానికి చెందిన ఆయన ప్రస్తుతం శ్రీనగర్‌ సీనియర్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈ కుట్ర భగ్నం వెనుక ఆయనతోపాటు ఎందరో అధికారుల పాత్ర ఉన్నప్పటికీ.. కేవలం ఒక పోస్టర్‌ ఆధారంగా ఛేదించిన చక్రవర్తి కీర్తి మాత్రం సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోతోంది..! ఇలాంటి ప్రచారం ఆయన భద్రతకు ప్రమాదమని, వందలాది మంది పోలీసు అధికారుల్లో ఒకడిగా తమ కొడుకు ఈ పనిచేశారని ఆయన తల్లిదండ్రులు చెబుతున్నారు.

భగ్నం చేశారిలా...

అక్టోబరు 19న శ్రీనగర్‌లోని నౌగామ్‌లో జేషే మహమ్మద్‌ పోస్టర్లు వెలిశాయి. వాటి ఆధారంగా నౌగామ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌ పోలీసులు అనేక ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. హరియాణా పోలీసులతో కలిసి ఫరీదాబాద్‌లో, ఉత్తరప్రదేశ్‌ పోలీసుల సాయంతో సహరాన్‌పూర్‌లో తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాలు రికార్డులను జల్లెడపట్టారు. ఈ క్రమంలో విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి, తీవ్రవాద భావాలున్న నిపుణులు, డాక్టర్లు, విద్యార్థులతో కూడిన వైట్‌ కాలర్‌, ఉగ్ర వ్యవస్థను గుర్తించారు. నేరారోపణలకు సంబంధించిన పత్రాలు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీ తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో నిషేధిత ఉగ్రవాద సంస్థలు, జైషే మొహమ్మద్‌, అన్సార్‌ ఘజ్వత్‌-ఉల్‌-హింద్‌ (ఏజీయుహెచ్‌)లతో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యూల్‌ను చేధించడంలో పోలీసులు విజయం సాధించారు.


విద్రోహశక్తుల అణచివేతలో చక్రవర్తి దిట్ట!

కర్నూలు నగరానికి చెందిన రిటైర్డు డాక్టర్‌ జీవీ రామగోపాల్‌రావు, పీసీ రంగమ్మ (ఆరోగ్యశాఖ రిటైర్డు అధికారి) దంపతుల మూడో సంతానం సందీప్‌ చక్రవర్తి. కర్నూలు మెడికల్‌ కళాశాల (కేఎంసీ)లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌-2014లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం శ్రీనగర్‌ అడిషనల్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సంఘ విద్రోహ శక్తుల ఏరివేతలో ఆర్మీకి సంపూర్ణ సహకారమందిస్తూ శభాష్‌ అనిపించుకున్న సందీప్‌ చక్రవర్తి శ్రీనగర్‌, పూంచ్‌, ఉరి, సోహోర్‌, బారాముల్లా, హంద్వారా, కుఫ్వారా వంటి ప్రాంతాల్లో అడిషినల్‌ ఎస్పీ, ఎస్పీ, సీనియర్‌ ఎస్పీగా సేవలందించారు. ప్రస్తుతం శ్రీనగర్‌ సీనియర్‌ ఎస్పీగా పని చేస్తున్నారు. రాయలసీమకు చెందిన ఆయన.. శాంతిభద్రతల పరిరక్షణ, విద్రోహ, అరాచకశక్తులను అణచివేయడంలో చూపించిన ధైర్యసాహసాలకు గానూ 2017లో తొలిసారిగా రాష్ట్రపతి శౌర్య పతకం అందుకున్నారు. ఇప్పటివరకు ఆరు సార్లు రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు, నాలుగు సార్లు జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలెంట్రీ సహా పలు అవార్డులు అందుకున్నారు.

Updated Date - Nov 14 , 2025 | 04:17 AM