Jackpot: యూఏఈలో తెలుగోడికి 240 కోట్ల లాటరీ
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:07 AM
అదృష్టం ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పలేం! అబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు యువకుడికి అమ్మ సెంటిమెంట్ అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.
అమ్మ సెంటిమెంట్‌తో జాక్‌పాట్ కొట్టిన బోళ్ల అనిల్ కుమార్
తల్లి పుట్టినరోజు తేదీ నెంబరునే లాటరీ టికెట్‌కు ఎంచుకున్నానని వెల్లడి
లాటరీలో దక్కిన మొత్తంలో కొంత భాగం
సేవా కార్యక్రమాలకు అందజేస్తానని వెల్లడి
అబుదాబి, అక్టోబరు 28: అదృష్టం ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పలేం! అబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు యువకుడికి అమ్మ సెంటిమెంట్ అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా రూ. 240 కోట్ల జాక్‌పాట్ వరించేలా చేసింది. యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద మొత్తాన్ని గెలుచుకున్న ఈ అదృష్టవంతుడి పేరు అనిల్‌కుమార్ బోళ్ల. 29 ఏళ్ల ఈ యువకుడి జీవితం ఒక్క రాత్రిలో పూర్తిగా మారిపోయింది. ఆయన ఇప్పుడు యూఏఈ దేశంలోనే అతిపెద్ద ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనిల్‌కుమార్ చాలా కాలంగా అబుదాబిలో ఉంటున్నారు. అనిల్‌కు లాటరీ టికెట్‌లు కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఈనెల 18న జరిగిన లక్కీ డే డ్రాలో విజేతగా నిలిచారు. అందులో యూఏఈలోనే రికార్డు స్థాయిలో 100 మిలియన్ దిర్హామ్స్ (రూ. 240 కోట్లు) గెలుచుకున్నారు. ‘‘ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు. అందరిలానే టికెట్ కొన్నాను. కానీ, అందులో ఆఖరి నంబరు చాలా ప్రత్యేకం. మా అమ్మ పుట్టినరోజునే ఆ నంబరుగా ఎంచుకున్నాను’’ అంటూ లాటరీ సంస్థ తనకు చెక్కు అందజేసిన సందర్భంగా అనిల్ తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పారు. ‘‘జాక్‌పాట్ గెలిచారంటూ కాల్ వచ్చినప్పుడు వెంటనే నమ్మలేకపోయాను.
ఈ రోజుకూ ఇది నిజమా కాదా అనిపిస్తోంది’’ అని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఈ బహుమతి మొత్తాన్ని ఎలా ఖర్చు చేయబోతున్నారని అడగ్గా, అనిల్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ఈ డబ్బును సరైన పద్ధతిలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నా. ఒక సూపర్ కారు కొని అందులో జాలీగా తిరగాలనే కోరిక ఉంది. ఇప్పుడు ఆ కోరిక తీర్చుకుంటా. ఓ పెద్ద స్టార్ హోటల్‌లో పార్టీ చేసుకోవాలనుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకువచ్చి, వారితో కలిసి జీవితాంతం ఇక్కడే ఆనందంగా గడపాలనుకుంటున్నా. అమ్మానాన్నలకు ఏవైనా కోరికలుంటే వాటిని నెరవేరుస్తా. అలాగే ఈ డబ్బులో కొంత భాగాన్ని చారిటీలకు విరాళమిస్తా’’ అని అనిల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనిల్‌కుమార్‌తో పాటు మరో 10 మంది కూడా 10 వేల దిర్హామ్ (రూ.24 లక్షలు) చొప్పున గెలుచుకోవడం విశేషం.
గెలిచిన మొత్తంలో ఎంత పన్ను చెల్లించాలి?
యూఏఈలో లాటరీ బహుమతిపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో అనిల్ ఎటువంటి పన్ను కట్టకుండానే మొత్తం రూ.240 కోట్లను అందుకుంటారు. అదే భారత్‌లో అయితే లాటరీ బహుమతులపై 30శాతం వరకు ఫ్లాట్ పన్ను విధిస్తారు. ఆపై పన్ను మొత్తంపై 15శాతం సర్‌చార్జ్ (రూ.1 కోటి కంటే ఎక్కువ గెలిస్తే) దీంతో పాటు మొత్తంపై 4ు ఆరోగ్యం, విద్య సెస్‌ను విధిస్తారు. అంటే మన దగ్గర ఎవరైనా రూ.240 కోట్లు గెలిస్తే, వారు మొత్తం పన్నుల రూపంలో రూ. 86 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. అన్ని తగ్గింపుల తర్వాత సుమారు రూ. 154 కోట్లు మాత్రమే బహుమతిదారుకు లభిస్తుంది.