Share News

Telanganas Rail Network: రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్న రైలు మార్గం

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:09 AM

ఆదిలాబాద్‌ నుంచి గద్వాల వరకు.. వికారాబాద్‌ నుంచి భద్రాచలం వరకు రాష్ట్రవ్యాప్తంగా రైలు మార్గం మరింత విస్తరించనుంది....

Telanganas Rail Network: రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్న రైలు మార్గం

  • 40 ప్రాజెక్టులు.. 4,353 కి.మీ.కు రూ.81 వేల కోట్ల ఖర్చు

  • కొత్త లైన్లకు సర్వేలు.. ఉన్నవి విస్తరణ.. వివిధ దశల్లో మరిన్ని

  • కేంద్ర ప్రభుత్వం మంజూరు.. సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చ

  • హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్‌ కారిడార్‌, 362 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రైల్‌పైనా సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ నుంచి గద్వాల వరకు.. వికారాబాద్‌ నుంచి భద్రాచలం వరకు రాష్ట్రవ్యాప్తంగా రైలు మార్గం మరింత విస్తరించనుంది. ఇప్పటికే ఉన్న రూట్లలో లైన్లను మరింత విస్తరించనున్నారు! కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్లు రానున్నాయి! ఇప్పటికే డీపీఆర్‌ ఆమోదం పొందిన ప్రాంతాల్లో వివిధ దశల్లో పనులు నడుస్తున్నాయి. వెరసి.. రాబోయే పది, పన్నెండేళ్లలో రాష్ట్రంలో ఎటు చూసినా ఏదో ఒక రైలు మార్గం ఉండనుంది. హైస్పీడు రైలు మార్గాలు, వాటి పక్కనే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులతోపాటు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు అనుసంధానించేలా పలు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త, విస్తరణ దశలో ఉన్న, పనులు కొనసాగుతున్న 40 ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు సుమారు 4,353.26 కి.మీ. మేర కొనసాగనున్నాయి. రాబోయే పది, 12 సంవత్సరాల్లో ఇందుకు దాదాపు రూ.81,680.17 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. ఈ మేరకు తెలంగాణకు మంజూరైన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు రెండు రోజుల కిందట సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్లతోపాటు రీజినల్‌ రింగు రైలు మార్గాలపైనా ఈ సమీక్షలో చర్చించారు. కాగా, తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తిచేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి.

భూ సేకరణే ప్రధాన సమస్య

దేశవ్యాప్తంగా రైలు, రోడ్డు మార్గాలను 2047 నాటికి మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కలుపుతూ కొత్త రైలు, రోడ్డు మార్గాలను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా గడిచిన కొంతకాలంగా తెలంగాణకు దాదాపు రూ.81 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అయితే, రైల్వే లైన్ల నిర్మాణానికి భూ సేకరణే ప్రధాన సమస్య. రాష్ట్రంలో భూముల విలువలు పెరగడం, రియల్‌ ఎస్టేట్‌ రోజురోజుకు పుంజుకుంటున్న నేపథ్యంలో భూ సేకరణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూసేకరణకు ఇచ్చే భూములకు బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువ మేరకు ధరలు లేకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి భూములు కోల్పోతున్న వారికి పరిహారంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపిస్తే.. ఈ సమస్య నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయి.


2.jpg

రాష్ట్రానికి మంజూరైన ప్రాజెక్టులు ఇవే

1) మనోహరాబాద్‌- కొత్తపల్లి కొత్త బీజీ లైను -151.36 కి.మీ.

2) కాజీపేట-బల్లార్ష మూడో లైను. ఇది రాష్ట్ర పరిధిలో 158.24 కి.మీ.. మహారాష్ట్రలో 43.86 కి.మీ ఉంటుంది.

3) కాజీపేట- విజయవాడ మూడో లైను అభివృద్ధి. ఇది రాష్ట్రంలో 183.64 కి.మీ... ఏపీలో 36 కి.మీ.

4) బీబీనగర్‌- గుంటూరు డబ్లింగ్‌ పనులు. ఇది రాష్ట్రంలో 139 కి.మీ, ఏపీలో 100 కి.మీ. పరిధి.

5) ముద్ఖేడ్‌-సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌-ధోన్‌ లైను డబ్లింగ్‌. ఇది తెలంగాణలో 294.82 కి.మీ,

ఏపీలో 73.91 కి.మీ, మహరాష్ట్రలో 49.15 కి.మీ.

6) డోర్నకల్‌-మణుగూరు డబ్లింగ్‌. 54.65 కి.మీ.

7) మోటమర్రి- విష్ణుపురం డబ్లింగ్‌ పనులు. 99.69 కి.మీ.

8) పగిడిపల్లి దగ్గర రైల్‌ ఓవర్‌ రైల్‌ పనులు 8.54 కి.మీ.

9) తాండూరు-సీసీఎల్‌ లైన్‌ 3.50 కి.మీ. మేర వై కనెక్టివిటీ.

10) విష్ణుపురం, నిజామాబాద్‌, వికారాబాద్‌, పెద్దపల్లి, జిల్లాల పరిధిలోని పిండ్యాల-హసన్‌పర్తి 35.97 కి.మీ. పరిధిలో 5 బైపా్‌సలు.


1.jpg3.jpg

్చసర్వే దశలో ఉన్న కొత్త ప్రాజెక్టులు..

ప్రాజెక్టులు: 20.. పరిధి: 2,437.89 కి.మీ. నిధులు: రూ.49,163.72 కోట్లు.

1) కాజీపేట-బల్లార్ష నాలుగో లైను పనులు.

ఇది తెలంగాణలో 190.14 కి.మీ, మహారాష్ట్రలో 43.86 కి.మీ.

2) కాజీపేట- విజయవాడ 4వ లైను.

రాష్ట్రంలో 184 కి.మీ. ఏపీలో 36 కి.మీ.

3) కాజీపేట- వరంగల్‌ దగ్గర రైల్‌ ఓవర్‌ రైల్‌ నిర్మాణాలు.

4) వాడి- గుంతకల్‌ (3-4 లైను పనులు). తెలంగాణలో 11.11 కి.మీ. ఏపీలో 93.82, కర్ణాటకలో 125.07 కి.మీ.

5) డోర్నకల్‌- మణుగూరు 3వ లైను.

6) పెద్దపల్లి- నిజామాబాద్‌ డబ్లింగ్‌ పనులు.

7) వికారాబాద్‌- కృష్ణా మధ్య కొత్త లైను.

8) హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్‌. రాష్ట్రంలో 230 కి.మీ. ఏపీలో 300, కర్ణాటకలో 96 కి.మీ. ఇది కొత్తలైను.

9) హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌. ఇది కొత్త లైను. రాష్ట్రంలో 180, ఏపీలో 464, తమిళనాడులో 61 కి.మీ పరిధి.

10) పటాన్‌చెరు (నాగలపల్లి)- ఆదిలాబాద్‌ వయా బోధన్‌, ఆర్మూర్‌ సెక్షన్‌. ఇది కొత్త లైను.

11) డోర్నకల్‌- గద్వాల వయా సూర్యాపేట, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి వరకు 296 కి.మీ. ఇది కూడా కొత్త లైను.

12) ఆదిలాబాద్‌-గడ్‌చండూరు కొత్త లైను. ఇది తెలంగాణలో 35.64 కి.మీ, మహారాష్ట్రలో 34.55 కి.మీ ఉంటుంది.

13) కాచిగూడ (ఉమ్డానగర్‌)-చిట్యాల- జగ్గయ్యపేట వరకు కొత్త లైను. ఏపీలో 10 కి.మీ, తెలంగాణలో 218 కి.మీ పరిధి.

14) కొండపల్లి నుంచి సత్తుపల్లి వరకు కొత్త లైను. ఇది ఏపీలో 4.87 కి.మీ, తెలంగాణలో 55.02 కి.మీ.

15) కొత్తగూడెం- కిరండోల్‌ కొత్త లైను. తెలంగాణలో 9.51 కి.మీ, ఏపీలో 12.32 కి.మీ, చత్తీ్‌సగడ్‌లో 136.51 కి.మీ.

16) తాండూరు సిమెంట్‌ క్లస్టర్‌ - జహీరాబాద్‌ వరకు కొత్త లైను.

17) భూపాలపల్లి నుంచి కాజీపేట వరకు కొత్త లైను.

18) బోధన్‌ నుంచి బీదర్‌ వరకు కొత్త లైను.

ఇది తెలంగాణలో 89.62 కి.మీ, కర్ణాటకలో 24.48 కి.మీ.

19) బోధన్‌ నుంచి లాతూర్‌ కొత్త లైను. తెలంగాణలో 18.40 కి.మీ, మహారాష్ట్రలో 109.92 కి.మీ పరిధి.

20) రీజినల్‌ రింగు రైలు హైదరాబాద్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ పక్కనే నిర్మాణం. 362 కి.మీ.

Updated Date - Sep 14 , 2025 | 08:26 AM