Share News

New Liquor Policy: కొత్త పాలసీతో రూ.870 కోట్ల కిక్కు!

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:39 AM

రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ (2025-27) ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాగా.. ఆ పాలసీ అమలుకు రెండు రోజుల ముందు నుంచే అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి....

New Liquor Policy: కొత్త పాలసీతో రూ.870 కోట్ల కిక్కు!

  • ఎక్సైజ్‌ శాఖకు ఓపెనింగ్‌ సేల్స్‌ అదుర్స్‌

  • 30న ఆల్‌ టైమ్‌ రికార్డు అమ్మకాలు

  • ఆ ఒక్క రోజే 350 కోట్ల మద్యం విక్రయాలు

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ (2025-27) ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాగా.. ఆ పాలసీ అమలుకు రెండు రోజుల ముందు నుంచే అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. పాలసీ ప్రారంభంలోనే అనూహ్యంగా పెరిగిన విక్రయాలతో ఎక్సైజ్‌ శాఖకు రూ.870 కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త పాలసీ కింద ఈ నెల 1 నుంచి దుకాణాలు తెరవడానికి అవసరమైన మద్యాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి వ్యాపారులు డిసెంబరు 29 నుంచే భారీగా కొనుగోలు చేశారు. దీంతో ప్రారంభంలోనేఅత్యధిక అమ్మకాలను నమోదు చేశారు. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున రూ.90 కోట్లకు మించని అమ్మకాలు జరిగేవి. కానీ.. కొత్త దుకాణాల ప్రారంభానికి ముందు రెండు రోజులు.. ప్రారంభమయ్యాక రెండు రోజులు కలిపి నాలుగు రోజుల్లోనే ఈ సగటు రెట్టింపునకు పైగా పెరిగింది. నవంబరు 29న రూ.200 కోట్లు, 30న రూ.350 కోట్లు, డిసెంబరు ఒకటిన రూ.170 కోట్లు, 2న రూ.150 కోట్ల చొప్పున మొత్తం విక్రయాలు రూ.870 కోట్లకు చేరింది. ఈ నాలుగు రోజుల్లో సగటున రోజుకు రూ.150 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయ్యాయి. ఇంత పెద్దమొత్తంలో మద్యం విక్రయాలు జరగడం ఇదే ప్రథమం అని ఎక్సైజ్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 (ఏ4) మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. వాటికి దరఖాస్తులు ఆహ్వానించి.. లాటరీ ద్వారా దుకాణదారులను ఎంపిక చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 98 శాతం మందికి లైసెన్స్‌లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ విక్రయాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయం లభించింది.

డబ్బుల చెల్లింపుల్లో ఆన్‌లైన్‌ విధానం

వ్యాపారులు దుకాణాలకు అవసరమైన మద్యం కొనుగోళ్లలోనూ ఎక్సైజ్‌శాఖ మార్పులు చేసింది. దుకాణదారులకు మరింత సౌలభ్యంగా ఉండేలా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తోంది. దుకాణదారు అవసరమైన మద్యం బాటిళ్లను ఎంపిక చేసుకుని.. వాటికి అయ్యే ఖర్చును ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించేలా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.

Updated Date - Dec 03 , 2025 | 03:39 AM