Share News

Telangana Government: సంపాదనలో ఆమె

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:58 AM

మొదట్లో స్థానిక అవసరాలను తీర్చే స్థాయిలో మాత్రమే సాధారణ విక్రేతగా ఉన్నారు శృతి ఇనుగుర్తి. వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు...

Telangana Government: సంపాదనలో ఆమె

  • ఇప్పటివరకు 21వేలకు పైగా పలు యూనిట్లను స్థాపించిన మహిళలు

  • ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద పలు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం

  • సంస్థలు, దుకాణాలకు యజమానులుగా మహిళలు.. యూనిఫామ్‌లు కుట్టగా 7.96 కోట్ల ఆదాయం

వీ-హబ్‌ విశ్వాసాన్ని నింపింది: శృతి

‘‘మొదట్లో స్థానిక అవసరాలను తీర్చే స్థాయిలో మాత్రమే సాధారణ విక్రేతగా ఉన్నారు శృతి ఇనుగుర్తి. వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు ఫ్రీ-కన్‌స్ట్రక్షన్‌ డిజైన్‌లను రూపొందిస్తూ ఇండస్ట్రియల్‌ షెడ్లు, గిడ్డంగులు, నివాస, వాణిజ్య భవనాల ప్రాజెక్టులకు అందిస్తున్నారు. వీ-హబ్‌ ఇంక్యుబేషన్‌ ప్రోగ్రామ్‌ ఆమెకు వ్యాపార నిర్వహణ, కొత్త వ్యాపార నమూనాలపై శిక్షణ ఇచ్చి మార్గదర్శనం చేసింది. ఫలితంగా శ్రుతి ఇప్పుడు ‘అహన్‌ మెటల్‌ సొల్యూషన్స్‌’కు యజమానురాలయ్యారు. ‘‘నా వ్యాపారాన్ని కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లగలిగే నమ్మకాన్ని వీ-హబ్‌ నాలో నింపింది. వారిచ్చిన ఆత్మ విశ్వాసం, మార్గదర్శకత్వం, గుర్తింపు నా ఎదుగుదలకు సరైన ప్రోత్సాహన్చిచ్చాయని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన శృతి ఇనుగంటి’’

గృహిణి నుంచి ఫుడ్‌ ట్రక్‌ ఓనర్‌గా..

‘‘సాధారణ గృహిణి నుంచి ఇప్పుడు రోజుకు రూ.3 వేలు సంపాదించే వరకు ఎదిగారు వనపర్తి జిల్లాకు చెందిన రాధారాణి. గతంలో స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా చిన్నపాటి హోం కిచెన్‌ను నడిపిస్తూ జీవనోపాధి పొందేవారు. ప్రభుత్వం తరఫున మెప్మా నుంచి రూ.6 లక్షల పెట్టుబడి లభించడంతో ‘ఇందిరా మహిళా శక్తి మీనాక్షి ఫుడ్‌ ట్రక్‌’ను ప్రారంభించారు. ఫలితంగా రోజుకు సుమారు రూ.3వేల సంపాదిస్తున్నారు.

యూనిఫామ్‌లు కుట్టి.. 7.96 కోట్ల ఆదాయం

‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఇందిరా మహిళా శక్తి స్టిచింగ్‌ సెంటర్ల’తో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల విద్యార్థుకు అందించే యూనిఫామ్‌లు సరఫరా చేసే పని అప్పగించారు. ఇప్పటివరకు 10.61 లక్షల యూనిఫామ్‌లను కుట్టి సరఫరా చేయడంతో 17,381 ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలకు రూ.7.96 కోట్ల ఆదాయం లభించింది. ఒక్కో యూనిఫామ్‌కు గతంలో రూ.50 చెల్లిస్తుండగా, ప్రజాప్రభుత్వం దానిని రూ.75కు పెంచడంతో మహిళల మరింత ఆదాయం లభిస్తోంది’’


వారు సంపాదిస్తూ.. మరికొందరికి ఉపాధినిస్తూ..

‘‘కరీంనగర్‌ జిల్లాలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు స్వయం సహాయక సంఘం సభ్యులు నెలకు ఒక్కొక్కరు రూ.23 వేలు సంపాదిస్తున్నారు. మరో 50 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. స్వప్న ఇందిరా మహిళా శక్తి ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ను నెలకొల్పి.. ఈవెంట్‌ ప్లానర్‌, బ్యూటీషియన్‌, క్యాటరింగ్‌, ఫొటోగ్రాఫర్‌, సౌండ్‌ సిస్టమ్‌ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. దీనికి ఇందిరా మహిళా శక్తి పథకం తోడవ్వడం, వారికి రూ.10లక్షల రుణం లభించడంతో వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. ఫలితంగా ఆదాయం గడిస్తున్నారు

... ఈ మహిళలే కాదు.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న చాలా మంది మహిళలు కూడా ఎంతో కొంత స్వశక్తితో సంపాదిస్తున్నారు. అన్ని రంగాలతో పాటు మహిళలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంతోనే ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను తీసుకురావడంతో పాటు వ్యాపారాల స్థాపనకు ఆర్థిక తోడ్పాటును అందిస్తోంది. ‘ఆమె’ను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేలా కృషి చేస్తోంది. మహిళా సాధికారతలో దేశానికే ఆదర్శంగా నిలిపేలా.. స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులు కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఎంఎ్‌సఎంఈ-2024పాలసీ, విద్యుత్‌ రాయితీలు, మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కుల కేటాయింపు, ప్రపంచ బ్యాంకు మద్దతుతో కొత్త ప్రోగ్రామ్‌లను రూపొందిస్తూ అమలు చేస్తోంది.

21,820 వ్యాపార యూనిట్ల స్థాపన..

రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద మహిళలకు ప్రోత్సాహన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా గార్మెంట్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హస్తకళలు, ఎలకా్ట్రనిక్స్‌ సహా పలు రంగాల్లో ఇప్పటివరకు 83 ఎస్‌హెచ్‌జీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 181 మంది సభ్యులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. అలాగే వీ-హబ్‌ మహిళా ఆక్సిలరేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వచ్చే నాలుగేళ్లలో 140 మహిళా యాజమాన్యాల ఆధ్వర్యంలోని స్టార్ట్‌పలకు ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఇప్పటికే 45 మంది మహిళలను ఎంపిక చేశారు. అలాగే ‘రైజింగ్‌ అండ్‌ ఆక్సిలరేటింగ్‌ ఎంఎ్‌సఎంఈ పర్ఫామెన్స్‌ (ర్యాంప్‌)’ కింద 56 స్వయం సహాయక సంఘాలకు, పలు స్టార్ట్‌పలకు ప్ర భుత్వం అన్ని రకాల సహాయం అందించనుంది. కాగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత, సామూహికంగా కలిపి దాదాపు 21,820 వ్యాపార యూనిట్లు స్థాపించారు. వీటి ద్వారా లక్షల మంది మహిళలకు ఉపాధి లభిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

-హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 07 , 2025 | 01:58 AM