Fine Rice Distribution Scheme: దేశమంతా.. సన్నబియ్యం
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:01 AM
తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని.. కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా ఈ పథకాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సూచించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన.....
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని.. కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా ఈ పథకాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సూచించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి తాజ్ హోటల్‌లో భేటీ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఇలా ప్రజలు తినేబియాన్ని పంపిణీ చేయడం వల్ల పథకం లక్ష్యం నెరవేరిందని.. పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌కు ప్రహ్లాద్ జోషి చెప్పారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని కోరుతూ సీఎం రేవంత్ ఈ భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 10లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని కోరారు. పీడీఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్‌కు సంబంధించి రూ.1,468 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలన్నారు. పీఎంజీకేఏవై అయిదో దశకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.343.27 కోట్ల సబ్సిడీ నిధులు విడుదల చేయాలని కోరారు. 2025-26 ఖరీ్‌ఫలో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రహ్లాద్ జోషీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గిందని, మిల్లింగ్‌కు అనువైన ముడి బియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఎగుమతి అవకాశాలను పరిశీలించాలని సలహా ఇచ్చారు.