Share News

Adani Group CEO Karan Adani: తెలంగాణ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్న సమ్మిట్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:50 AM

తెలంగాణ ఆత్మ విశ్వాసాన్ని ఈ సమ్మిట్‌ ప్రతిబింబిస్తోందని అదానీ గ్రూప్‌ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ఎండీ కరణ్‌ ఆదానీ అన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్‌ వివిధ రంగాల్లో......

Adani Group CEO Karan Adani: తెలంగాణ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్న సమ్మిట్‌

  • అదానీ గ్రూప్‌ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ఎండీ కరణ్‌ అదానీ

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణ ఆత్మ విశ్వాసాన్ని ఈ సమ్మిట్‌ ప్రతిబింబిస్తోందని అదానీ గ్రూప్‌ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ఎండీ కరణ్‌ ఆదానీ అన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్‌ వివిధ రంగాల్లో పెట్టిన పెట్టుబడుల గురించి వివరించారు. ముఖ్యంగా.. గత మూడేళ్ల కాలంలో రాష్ట్రంతో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నట్టు వివరించారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగంలో సేవలందించే దిశగా హైదరాబాద్‌ కేంద్రంగా ఏరో స్పేస్‌ పార్కును అభివృద్ధి చేశామన్నారు. దేశంలోనే తొలి లాంగ్‌ ఎండ్యూరెన్స్‌ యూఏవీ తయారీ కేంద్రం ఇదేనని గుర్తుచేశారు. ఇక్కడి నుంచి భారత సాయుధ దళాలకు, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతులు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రంలో 1500 మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. డిజిటల్‌ మౌలిక సదుపాయాలకు సంబంధించి రూ.2500 కోట్ల పెట్టుబడితో 48 మెగావాట్ల గ్రీన్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. అది కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత అభివృద్ధికి, క్లౌడ్‌ టెక్నాలజీకి, హైపెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌కు ఉపయోగపడుతుందన్నారు. దాదాపు రూ.4000 కోట్లతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. మణుగూరు, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాలను కలుపుతూ 100 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. సిమెంట్‌ తయారీ రంగంలో రూ.2 వేల కోట్లతో అత్యాధునిక సిమెంట్‌ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అదానీ గ్రూప్‌ నుంచి గత మూడేళ్లలో తెలంగాణలో తయారీ కేంద్రాల నిర్మాణంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని.. తద్వారా 7000 మందికి ఉపాధి కల్పించామని వివరించారు.

ఎరిక్‌ కంటే ఎక్కువ పెట్టుబడి పెడతారా?

కరణ్‌ ప్రసంగానికి ముందు.. ఆయన్ను ఆహ్వానిస్తూ.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడారు. ‘‘మీకన్నా ముందు ప్రసంగించిన ఎరిక్‌ స్విడర్‌ తెలంగాణలో లక్ష కోట్లపెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. మీరు దాన్ని అధిగమిస్తారా.. అదే స్థాయిలో పెట్టుబడి పెడతారా?’’అని చమత్కరించారు.

Updated Date - Dec 09 , 2025 | 03:50 AM