Share News

Deputy CM Bhatti Vikramarka: ప్రజావాణి సంకల్పం పరిపూర్ణం

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:15 AM

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సీఎం ప్రజావాణి కార్యక్రమం..

Deputy CM Bhatti Vikramarka: ప్రజావాణి సంకల్పం పరిపూర్ణం

  • రెండేళ్లలో ప్రజల నుంచి 1.07 లక్షల అర్జీలు.. వాటిలో 74ు పరిష్కారం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సీఎం ప్రజావాణి కార్యక్రమం.. సమస్యల్లో ఉన్నవారికి ఆపన్నహస్తంలా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రెండేళ్లలో ప్రజావాణి కార్యక్రమం లక్ష్యం పరిపూర్ణంగా నెరవేరిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న భట్టి మాట్లాడుతూ.. ప్రజావాణి లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. గత రెండేళ్లలో ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో 74ు అర్జీలకు పరిష్కారం చూపినట్లు చెప్పారు. మిగతా వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల కోసం కనీసం ప్రజాభవన్‌ గేట్లు కూడా తెరువని వారు, ఇప్పుడు ప్రజావాణిని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆర్టీసీలో 242 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నాం: మంత్రి పొన్నం

ఆర్టీసీలో శాశ్వతంగా సర్వీసు నుంచి తొలగించిన 242 మంది ఉద్యోగులను ప్రజావాణి కారణంగా తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 1,750 మంది డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల సమస్య ప్రజావాణి ద్వారానే పరిష్కారమైందని గుర్తుచేశారు. ఆదిలాబాద్‌లో దళిత రైతుల సమస్యలను, విదేశాల్లోని గల్ఫ్‌ బాధితుల సమస్యలను ప్రజావాణి పరిష్కరించిందని వెల్లడించారు. సీఎం ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రెండేళ్లలో మొత్తం 1,07,829 పిటిషన్లు రాగా.. అందులో 64,623 పిటిషన్లు పరిష్కారమైనట్లు ప్రజావాణి ఇన్‌చార్జ్‌ జి.చిన్నారెడ్డి, రాష్ట్ర నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌ తెలిపారు. మిగిలిన 43,206 పిటిషన్లు పరిష్కార దశలో ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజావాణి ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ మంద భీమ్‌రెడ్డి, హోసింగ్‌ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్‌, సీజీజీ చైర్మన్‌ రవిగుప్తా, హైదరాబాద్‌ కలెక్టర్‌ దాసరి హరిచందన పాల్గొన్నారు.


ఆశాదీపంలా ప్రజావాణి

వ్యక్తిగత సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణిని 2023, డిసెంబరులో ప్రారంభించింది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజాభవన్‌లో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. రెండేళ్లలో 185 సెషన్లు నిర్వహించారు. వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని నియమించారు. ప్రజావాణికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజాభవన్‌ ఎదుట పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ప్రధానంగా భూసమస్యలు, భూ కబ్జాలు, పెన్షన్లు, ఇళ్లు, ఉద్యోగాలపై అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇతర దేశాల్లో పనిచేస్తున్నవారి సమస్యల పరిష్కారం కోసం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీర్ఘకాలంగా సమస్యల్లో ఉన్న ఎంతోమందికి ప్రజావాణి పరిష్కార మార్గాలు చూపుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా జైనధ్‌ మండలంలోని కురా గ్రామానికి చెందిన రైతులు తమ భూములను సాగు చేసుకునేందుకు బోర్లు వేయాలని, విద్యుద్ధీకరణ చేయాలని విన్నవించగా.. వెంటనే సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన 1,750 మందికి కోర్టు కేసుల కారణంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అంద లేదు. వీరి సమస్యకు ప్రజావాణి పరిష్కారం చూపింది. ప్రజావాణికి వచ్చి వినతిపత్రం అందివ్వటంతో అధికారులు తన సమ్యకు పరిష్కారం చూపారని, తాను తిరిగి ఆర్టీసీలో విధుల్లో చేరానని డ్రైవర్‌ రామస్వామి సంతోషం వ్యక్తంచేశారు.

Updated Date - Dec 20 , 2025 | 05:15 AM