Loan Harassment: ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:21 AM
ప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులకు తాళలేక ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం..
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులే కారణం
వనపర్తి రూరల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులకు తాళలేక ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు భార్య నీలిమ (38) గోపాల్‌పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా వనపర్తిలోని ఎన్టీఆర్ నగర్‌లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి చంద్రయ్య ఇంట్లో భార్యాభర్తలు అద్దెకు ఉంటున్నారు. ఇంటి యజమాని చంద్రయ్య దగ్గర నీలిమ తన భర్తకు తెలియకుండా దాదాపు రూ. 20 లక్షల అప్పు అధిక వడ్డీకి తీసుకున్నారు. మొత్తం డబ్బులు తిరిగి చెల్లించాలని కొన్ని రోజులుగా అప్పు ఇచ్చిన చంద్రయ్య ఆమెను వేధించాడు. ఈ విషయం భర్తకు కూడా తెలిసింది. ఈ తరుణంలో ప్రతీ రోజు మాదిరిగానే విధులకు హాజరైన నీలిమ మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పు ఇచ్చిన వారి వేధింపులతో నీలిమ ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. కాగా, మంత్రి జూపల్లి కృష్ణారావు ఏరియా ఆసుపత్రికి వెళ్లి నీలిమ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.