Share News

Gold Robbery: ఇంట్లో అద్దెకు దిగి.. యజమానురాలినే చంపి

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:40 AM

తెలంగాణలో బంగారు నగల కోసం ఓ వృద్ధురాలిని గొంతునులిమి హత్య చేసిన యువకుడు.. మృతదేహాన్ని మరో ఇద్దరి సాయంతో ఏపీకి తరలించి గోదావరి నదిలో పడేశారు.

Gold Robbery: ఇంట్లో అద్దెకు దిగి.. యజమానురాలినే చంపి

  • మృతదేహాన్ని కారు డిక్కీలో కుక్కి ఏపీకి తరలింపు

  • ‘కోనసీమ’ గోదావరిలో పడేసిన వైనం.. ముగ్గురికి రిమాండ్‌

  • మిస్సింగ్‌ కేసును ఛేదించిన నాచారం పోలీసులు

తార్నాక, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బంగారు నగల కోసం ఓ వృద్ధురాలిని గొంతునులిమి హత్య చేసిన యువకుడు.. మృతదేహాన్ని మరో ఇద్దరి సాయంతో ఏపీకి తరలించి గోదావరి నదిలో పడేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. నాచారం పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్‌లోని బాబానగర్‌ ప్రాంతానికి చెందిన సూరెడ్డి సుజాత(65) ఈ నెల 18న ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వృద్ధురాలిని హత్య చేసింది.. ఆమె ఇంట్లో అద్దెకున్న ఏపీకి చెందిన యువకుడే అని నిర్ధారణకు వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, పెరవలి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మడ్డు అంజి బాబు(31) రెండు నెలల క్రితం మల్లాపూర్‌లోని బాబానగర్‌ ప్రాంతానికి చెందిన సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న అంజి బాబు ఈనెల 18న వృద్ధురాలు సుజాత ఇంట్లోకి వెళ్లి ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను కాజేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు తన బామ్మర్ది, కోనసీమ జిల్లా పెరవలి మండలం, ఖండవల్లి గ్రామానికి చెందిన నక్కంటి యువరాజు (18), స్నేహితుడు నూకల దుర్గారావు (35) (మన్నానగర్‌ కాలనీ, భీమవరం, అమలాపురం మండలం) సాయంతో మృతదేహాన్ని కారు డిక్కీలో కుక్కి ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు తీసుకొచ్చి గోదావరి నదిలో పడేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసు ఛేదించారు. కోనసీమ జిల్లా, పొదులాడ జంక్షన్‌ వద్ద నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - Dec 30 , 2025 | 04:40 AM