White Ration Cards: కోటి కార్డులు!
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:44 AM
తెల్ల రేషన్ కార్డుల సంఖ్య రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన నెల రోజుల్లో ఏకంగా 1.51 లక్షల కార్డులను పంపిణీ చేయటంతో..
రికార్డు స్థాయికి చేరిన తెల్ల రేషన్ కార్డులు
కాంగ్రెస్ సర్కారు ఏర్పడేనాటికి 89,95,282
కొత్త కార్డుల పంపిణీతో 1,01,22,324కి చేరిన సంఖ్య
కొత్త రేషన్ లబ్ధిదారులకు దసరా కానుకగా సన్నబియ్యం
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెల్ల రేషన్ కార్డుల సంఖ్య రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన నెల రోజుల్లో ఏకంగా 1.51 లక్షల కార్డులను పంపిణీ చేయటంతో.. తాజాగా ‘కోటి’ మైలురాయికి చేరింది. సెప్టెంబరు కోటా ప్రకారం రేషన్ కార్డుల సంఖ్య 99,70,832 కాగా.. ఇప్పుడు 1,01,22,324కు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని ఒక రికార్డుగా భావిస్తోంది. కొత్తగా కార్డులు పొందిన కుటుంబాలన్నీ అక్టోబరు నుంచి లబ్ధిదారుల జాబితాలో చేరతాయి. దసరా కానుకగా వీరికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో రేవంత్ సర్కారు ఏర్పడేనాటికి తెల్ల రేషన్ కార్డులపై ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3.25 కోట్లకు చేరటం గమనార్హం. నిజానికి, రేవంత్ సర్కారు అమలు చేసే ఆరు గ్యారెంటీల్లో రేషన్ కార్డుల పంపిణీ ఒకటి. రేవంత్ సర్కారు ఏర్పడేనాటికి 89,95,282 కార్డులున్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు కావాలంటూ కొత్తగా 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) నుంచి లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మే చివరికి వచ్చేసరికి 2,03,156 కార్డులు మంజూరు చేసింది. ఈ ఏడాది జూలై 25వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. పంద్రాగస్టు వరకూ 15 రోజులపాటు కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. అంతేనా.. కార్డుల మంజూరు ప్రక్రియను నిర్ణీత కాలానికే పరిమితం చేయకుండా.. నిరంతరాయంగా కొనసాగిస్తామని ప్రకటించింది. బియ్యంతోపాటు ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తదితర పథకాలకు కూడా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటుండటంతో.. మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గడిచిన నెల రోజుల వ్యవధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 15వ తేదీ (సోమవారం)నాటికి 1,51,492 కొత్త కార్డులను మంజూరు చేయటం విశేషం.
11.27 లక్షల కొత్త కార్డుల పంపిణీ
గత ప్రభుత్వ హయాంలోనూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్డులు కావాలంటూ మొత్తం 18 లక్షల దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు 11.27 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. ఇంకా సుమారు 2.50 లక్షల కుటుంబాలకు కార్డులు మంజూరు చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లటం, కొన్ని ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయకపోవటం, సాంకేతిక సమస్యలు తలెత్తటంతో వీటిని పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు మంజూరు చేస్తామని తెలిపారు. మండల, జిల్లాస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక ఐటీ సెల్ ఏర్పాటు చేసి.. కార్డుల మంజూరు, పంపిణీని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి అందిన 18 లక్షల దరఖాస్తుల్లో సుమారు 14 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఇప్పటికీ ఎవరైనా దరఖాస్తులు చేసుకోనివారు ఉంటే... మీ- సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.