Telangana Government: వెల్‌నెస్ కేంద్రాలు.. ఇక డీఎంఈ పరిధిలోకి..
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:33 AM
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు నగదురహిత వైద్యసేవలందించే వెల్‌నెస్ కేంద్రాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...
ఖైరతాబాద్, కూకట్‌పల్లి కేంద్రాలు నిమ్స్‌కు
వైద్యేతర సిబ్బంది నియామకం ఆరోగ్యశ్రీకి
నేడు అఽధికారికంగా అప్పగింత
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు నగదురహిత వైద్యసేవలందించే వెల్‌నెస్ కేంద్రాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలో ఉన్న వెల్‌నెస్ సెంటర్ల పరిపాలన, నిర్వహణ బాధ్యతలను ఇకపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), నిమ్స్ పరిధిలోకి తెచ్చింది. ఈ కేంద్రాల నిర్వహణను ఆయా విభాగాలకు సోమవారం అధికారికంగా అప్పగించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వెల్‌నెస్ సెంటర్లలో స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారంతోపాటు ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచడానికి ఈ పరిపాలనా మార్పు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న 12 వెల్‌నెస్ కేంద్రాల్లో.. పదింటిని వైద్య విద్య సంచాలకులకు, మరో రెండింటిని నిమ్స్ ఆస్పత్రికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. వెల్‌నెస్ కేంద్రాల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ట్రస్ట్ సీఈవో ఇటీవల రాసిన లేఖ మేరకు.. ప్రభుత్వం తాజాగా జీవో నంబరు 204 జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, కూకట్‌పల్లి వెల్‌నెస్ కేంద్రాలు నిమ్స్ పరిఽధిలోకి రాగా, ఇక ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వనస్థలిపురం (రంగారెడ్డి జిల్లా), హన్మకొండలోని వెల్‌నెస్ కేంద్రాలు డీఎంఈ పరిధిలోకి వచ్చాయి.
తీరనున్న వైద్య నిపుణుల కొరత..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వెల్‌నెస్ కేంద్రాలకు 2వేల వరకు ఓపీ(ఔట్ పేషెంట్) వస్తుంది. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటే ఓపీల సంఖ్య 3000-4000 మధ్య నమోదయ్యే అవకాశం ఉంటుంది. వాస్తవానికి వెల్‌నెస్ కేంద్రాల్లో సుమారు 10-12 రకాల స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ, ప్రభుత్వం ఇచ్చే వేతనాలకు వైద్యులెవ్వరూ ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటిదాకా జిల్లాల్లో స్పెషలిస్టులు లేక అంతా హైదరాబాద్ నిమ్స్‌కు రావాల్సిన పరిస్థితి. దీంతో వైద్యుల కొరతపై నిత్యం వైద్యశాఖకు అందుతున్న ఫిర్యాదులను అధిగమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న స్పెషలిస్టు వైద్యులను వెల్‌నెస్ సెంటర్లకు అనుసంధానం చేయడం ద్వారా వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్లకు వచ్చే రోగులకు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్ వంటి వివిధ విభాగాల వైద్య సలహాలు, చికిత్సలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో, ఉద్యోగులు పెన్షనర్లు వైద్యసేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుందని అంచనా వేస్తున్నారు. ఈ స్పెషాలిటీ వైద్యులందర్నీ బోధనాస్పత్రుల నుంచి రోస్టర్ పద్ధతిలో వెల్‌నెస్ కేంద్రాలకు పంపుతారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు విధులు నిర్వహించాల్సి వుంటుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు వైద్యేతర సిబ్బంది నియామకాలన్నీ ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్య వేక్షిస్తుంది. అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు వంటి పరిపాలనా సిబ్బందిని రాజీవ్ హెల్త్‌కేర్ ట్రస్టు నియమిస్తుంది.
నిధుల వినియోగం ఇలా..
కాగా, వెల్‌నెస్ కేంద్రాల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని ఉద్యోగులు, జర్నలిస్టు ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎ్‌స) కోసం కేటాయించిన బడ్జెట్ నుంచే భరించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక పరికరాలు, మందులు కొనుగోలు, మరమ్మతులు వంటి వాటికయ్యే ఖర్చులను ఆరోగ్య పథకాల కింద ఉన్న అడ్మినిస్ట్రేటివ్ నిధులను వినియోగించి ఆరోగ్యశ్రీ ట్రస్టే ఖర్చు చేయనుంది. కాగా, కొత్తగా వచ్చే వైద్య సిబ్బందికి వేతనాలివ్వాల్సిన ఆర్థిక భారం ట్రస్టుపై ఉండదు. అదే సమయంలో, పెరిగే అవుట్ పేషెంట్‌కు అనుగుణంగా ఇవ్వాల్సిన ఔషధాల ఖర్చు మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏటా ఔషధాల కోసం ట్రస్టు రూ.18 కోట్లు ఖర్చు చేస్తోంది.